కొత్తూరులో ఎస్బీఐ ఏటీఎం అపహరణ
ఆదివారం తెల్లవారు జామున కొత్తూరులో జరిగిన ఏటీఎం అపహరణ జిల్లా ఉలిక్కిపడేలా చేసింది. అప్పుడే తెరిపిచ్చిన వర్షాల నుంచి తేరుకుంటున్న జనం..ఈ విషయం తెలిసి హతాశులయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎక్కడా ఎటీఎంను ఎత్తుకుపోవడం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. పక్కా వ్యూహంతోనే దుండగులు చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఠాల పనేనన్న అనుమానాలు లేకపోలేదు.
కొత్తూరు: కొత్తూరులో నగదుతో ఉన్న ఏటీఎంను సినీ ఫక్కీ లో ఎత్తుకుపోయారు. శనివారం రాత్రి నాలుగు గంటల సమయంలో (తెల్లవారితే ఆదివారం) ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ విషయం కాస్త దావానంలా వ్యాపించడంతో..సంఘటన స్థలానికి స్థానికులు చేరుకున్నారు.
సీసీ కెమెరాను మట్టితో కప్పి..
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే..పక్కా వ్యూహంతోనే ఏటీఎంను అపహరించినట్లు తెలుస్తోంది. ఏటీఎం గదిలోని సీసీ కెమెరాను మట్టితో కప్పడంతో పాటు..ఆ గదిలో కారం పొడి జల్లారు. సుమారు 800 కేజీల బరువున్న ఏటీఎంకు ఉన్న ఇంటర్నెట్ వైర్లను తప్పించారు. గది వద్దకు మూడు చక్రాల వాహనం తెచ్చి..ఎక్కించుకుని వెళ్లినట్లు..టైర్ల అచ్చుల ఆధారంగా తెలుస్తోంది. ఏటీఎం కింద కాంక్రీట్ వేయకపోవడం, కనీసం ఇనుప స్టాండును కూడా గచ్చుపై బిగించకపోవడం తో దుండుగులు సులువుగా ఏటీఎంను ఎత్తుకెళ్లినట్లు పోలీ సులు భావిస్తున్నారు.
భారీగా నగదు
చోరీ జరిగే సమయానికి ఏటీఎంలో రూ.10 లక్షల 87 వేల 300 రూపాయలు ఉన్నట్లు మేనేజర్ సూర్యప్రకాశరావు తెలిపా రు. తెల్లవారితే ఆదివారం కావడంతో..శనివారం మరింత న గదు ఉంచాలనుకున్నామని, అయితే..రూ.వెయ్యి నోట్లు అందుబాటులో లేకపోవడంతో తక్కువ ఉంచామని చెప్పారు.
రంగంలోకి పోలీసులు
చోరీపై బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వి.రమేష్ చెప్పారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లు సంఘటన స్థలం వద్దకు చేరుకుని చోరీ జరిగిన వైనాన్ని పరిశీలించాయి. డాగ్ స్క్వాడ్ ఏటీఎం పరిసరాల్లో ఉన్న శ్లాబు ఇళ్లపైకి, బత్తిలి రోడ్డువైపు వెళ్లిన సూచనలు కనిపించాయి. దీంతో ఒడిశాకు చెందిన మఠాయే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీ సులు భావిస్తున్నారు.
ఎస్పీ పరిశీలన
సంఘటన స్థలాన్ని ఎస్పీ ఏఎస్‌ఖాన్ సందర్శించారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. బ్యాంక్ మేనేజర్ సూ ర్యప్రకాశరావును ప్రశ్నించారు. విశాఖపట్నం రీజియన్ ఎస్బీఐ సెక్యూరిటీ అధికారి యాదవ్ నుంచి వివరాలు రాబట్టారు. చోరీ జరిగిన సమయంలో సీసీ కెమేరాలో నమోదైన ఫొటోలను పరిశీలించారు. అయితే..కెమేరా సక్రమంగా పనిచేయకపోవడంతో.. రికార్డైన దృశ్యాలను .పూర్తి స్థాయిలో చూడలేకపోయారు.
ఆ మూడున్నర నిమిషాలే కీలకం
ఇదిలా ఉండగా..దుండగులు ఏటీఎంను ఎత్తుకుపోయిన సమయంలో సీసీ కెమెరాలో మూడున్నర నిమిషాల రికార్డింగ్ జంప్ అవుతోంది. ఎస్పీ ఈ దృశ్యాలను స్వయంగా పరిశీలించినా..కెమెరా జంప్ అవుతుండడంతో ఆ మూడున్నర నిమిషాలే కీలకంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలో గత కొన్ని రోజుల నుంచి రికార్డయిన వివరాలను పరిశీలించాలని డీఎస్పీ శాంతోను ఆదేశించారు. ఏటీఎం సీసీ కెమెరాలో శనివారం రాత్రి 3 గంటలు 52 నిమషాల 50 సెకెన్ల నుంచి 3 గంటల 56 నిమషాల 33 సెకెన్లకు జంప్ అవుతోంది. అంతవరకు గదిలో ఏటీఎం ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపిస్తోంది. తరువాత నల్లని తెరమాదిరిగా చూపిస్తోంది. అదే సమయంలో బ్యాంకు సీసీ కెమెరా కూడా సు మారు 13 సెకెన్ల జంప్ అయినట్లు చూపుతోంది. అలాగే చోరీకి గురైన ఏటీఎం పక్కన సీడీఎం( క్యాష్ డిపాజిట్ మిషన్) ఉంది. దీని కెమెరా రాత్రి రెండు గంటల నుంచి హేంగ్ అయిపోయింది. సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయకపోవడంతో..దర్యాప్తునకు అవరోధం కలుగుతోందని పోలీసులు పేర్కొంటున్నారు. బ్యాంకు సాంకేతిక నిపుణులతో సంప్రదించి..దర్యాప్తు చేస్తామని ఎస్పీ చెప్పారు.
సమగ్ర దర్యాప్తు
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..చోరీపై పూర్తి స్థాయి లో దర్యాప్తు నిర్వహిస్తామన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రాలో ఇటువంటి చోరీ జరగలేదని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందన్నారు. ముందుగా బ్యాంకు లోపల, బయట దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఆయనతో పాటు పాలకొండ డీఎస్పీ దేవానంద్ శాంతో, సీఐ ఇలియాబాబు, ఎస్సై రమేష్‌లు ఉన్నారు. అనంతరం ఎస్డీ శ్రీదేవిరావు సంఘటన స్తలాన్ని పరిశీలించారు.
ఏజీఎం పరిశీలన
ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రాజారామ్మోహనరాయ్ బ్యాం కును సందర్శించారు.ఏటీఎం గదిని, పలు రికార్డులను పరిశీలించారు. క్యాష్ వివరాలు తెలుసుకున్నారు.