తపాలా ఏటీఎంలు వచ్చేస్తున్నాయ్!
హైదరాబాద్: ఇప్పటిదాకా ఏటీఎంలు అంటే బ్యాంకులకే సొంతమైన వ్యవస్థ. ఈ గుత్తాధిపత్యానికి అడ్డుకట్టవేస్తూ తపాలాశాఖ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. డిసెంబరు నాటికి వాటిని సిద్ధం చేసేలా తపాలాశాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, అంధ్రప్రదేశ్లకు సంయుక్తంగా ఉన్న తపాలాశాఖ ఏపీ సర్కిల్ పరిధిలో తొలిదశగా 95 ప్రధాన పోస్టాఫీసుల్లో ఇవి అందుబాటులోకి రాబోతున్నాయి. మలిదశలో సబ్-పోస్టాఫీసులు, గ్రామీణ తపాలా కార్యాలయాల్లో కూడా ఏర్పాటు చేస్తారు. ప్రధాన తపాలాకార్యాలయాల్లో మాత్రం ఈ డిసెంబరుకే ఏటీఎంలు సిద్ధం కాబోతున్నాయి. అవి వచ్చే జనవరి-ఫిబ్రవరిల్లో పనిచేయటం మొదలుపెట్టే అవకాశం ఉంది. సనత్‌నగర్ పోస్టాఫీసులో సెంట్రల్ సర్వర్‌ను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా కార్యకలాపాలను పరిశీలిస్తున్నారు. పొదుపు ఖాతాలకు ఐదు అంకెల్లో ఉన్న ఖాతా నంబర్లను 16 అంకెలకు మార్చబోతున్నారు.
ఏంటి ఉపయోగం...
ఏ పోస్టాఫీసు ఖాతాలో ఉన్న డబ్బులనైనా కావాల్సినచోట డ్రా చేసుకునే వెసులుబాటు ఈ ఏటీఎంల ద్వారా కలుగుతుంది. ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ సుధాకర్ ప్రత్యేక చొరవతో ఈ పనులను వేగంగా జరిపిస్తుండటంతో దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందుగానే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటీఎంల వ్యవస్థ సిద్ధం కాబోతోంది.