జనావేధన
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రద్దు చేసిన పెద్ద నోట్లను మార్చుకునేందుకు.. చిల్లర నోట్లు, కొత్త నోట్లు తీసుకునేందుకు బ్యాంకుల ఎదుట జనం పెద్దఎత్తున క్యూ కడుతూనే ఉన్నారు. అడుగడుగునా అవస్థలతో వేదనకు గురవుతుంటే.. మరోవైపు వారిని మోసం చేసే ముఠాలు చెలరేగిపోతున్నాయి. కొయ్యలగూడెం మండలం కె.కన్నాపురంలో ఆంధ్రాబ్యాంక్ వద్ద ఓ వృద్ధుణ్ణి మోసం చేసి రూ.49 వేల పాత నోట్లను దొంగలు అపహరించుకుపోయారు. ఆ గ్రామానికి చెందిన విజయరాజు అనే వృద్ధుడు తన వద్ద ఉన్న నగదును బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు బ్యాంకుకు వచ్చాడు. బల్లమీద కూర్చుని ఉండగా ఇద్దరు వ్యక్తులు మీ వస్తువులు పడిపోయాయని చెప్పి అతని వద్ద ఉన్న నోట్లను దొంగిలించి పారిపోయారు. మరోవైపు ఒకరి ఆధార్ కార్డు నంబర్‌ను ఉపయోగించి వేరేవారు డబ్బులు మార్చుకుపోయిన ఘటనలు పలుచోట్ల చోటుచేసుకున్నాయి. ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లి రూ.4వేల పాత నోట్లను మార్చుకునేం దుకు ప్రయత్నించగా ఇప్పటికే మీ ఆధార్ నంబర్‌తో సొమ్ములు మార్చుకున్నారన్న సమాధానం రావడంతో విస్తుపోయిన ఘటనలు ఏలూరులో చోటుచేసుకున్నాయి. జిరాక్స్ తీయిస్తున్న సమయంలో మరో కాపీ తీసుకున్నారా, లేకపోతే సిమ్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఇచ్చిన జిరాక్స్ కాపీలను దుర్వినియోగం చేస్తున్నారో తెలియని పరిస్థితి పలుచోట్ల ఉంది.
తెరుచుకోని ఏటీఎంలు
మరోవైపు శుక్రవారం కూడా ఏటీఎంలు తెరుచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ప్రాంగణాల్లో ఉన్న ఏటీఎంలు మాత్రం కొద్దిసేపు పనిచేయగా, బహిరంగ ప్రాంతాల్లోని ఏటీఎంలు పూర్తిగా మూసి ఉంచారు. అక్కడక్కడా కొన్ని ఏటీఎంలు తెరుచుకున్నా తక్కువ మొత్తంలో రూ.100 నోట్లు మాత్రమే పెట్టారు. రూ.2 వేల నోట్లు ఏటీఎంలలో పెట్టడానికి సాంకేతిక సమస్య ఉందని, దానిని సరిచేస్తేగాని వాటిని ఏటీఎం సెంటర్లలో అందుబాటులో ఉంచలేమని అధికారులు ప్రకటించారు. రూ.2000 నోట్లు, రూ.50 నోట్లు పెట్టాలంటే సాఫ్ట్వేర్ మార్చాల్సి ఉంటుందని, అందువల్ల జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. మరోవైపు ఏలూరు పెద్ద పోస్టాఫీసు వద్ద రూ.500, రూ.1000 నోట్లు చిల్లర ఉన్నా మార్చుకోవడం లేదంటూ ప్రజలు ధర్నాకు దిగారు. చిల్లర సమస్యతో పెట్రోల్ బంక్‌లు శనివారం నుంచి మూసివేయనున్నట్టు ప్రచారం జరగడంతో వాటివద్ద రద్దీ పెరిగింది.
రూ.లక్ష విసిరేసి వెళ్లిన వ్యక్తి
ద్వారకాతిరుమల నుంచి భీమడోలు వైపు వెళుతున్న ఒక కారులోంచి గుర్తు తెలియని వ్యక్తి దాదాపు రూ.లక్ష విలువైన పాత వెయ్యి నోట్లను రోడ్డుపైకి విసిరేసి ఆగకుండా వెళ్లిపోయాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న కొందరు వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. అవి నిజమైన నోట్లా.. కాదా.. అన్న సందేహంతో పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీశారు. ఇదిలావుంటే మొదటి రోజు కంటే రెండో రోజున బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద జనం రద్దీ పెరిగింది. బారులు తీరి నగదు బదిలీ కోసం గంటల తరబడి వేచి ఉంటున్నారు. ఎంతో కొంత పెద్ద నోట్లను వదిలించుకోవడమే చాలన్నట్టుగా పేద, మధ్యతరగతి వర్గాలు ఇంటి పన్నులు, విద్యుత్ బిల్లులకు పెద్ద నోట్లను చెల్లించారు.