తల్లీబిడ్డను విడదీసిన అతివేగం
ఉట్నూర్, న్యూస్‌లైన్ : అతివేగం తల్లీబిడ్డను విడదీసింది. నెల రోజుల పసికందుకు మాతృప్రేమను దూరం చేసింది. జైనూర్ మండలం తిమ్కపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతిచెందగా.. మరో పది మంది గాయపడ్డారు.
జైనూర్ ఎస్సై కృష్ణమూర్తి కథనం ప్రకారం.. సిర్పూర్(యు) మండలం మామిడిపల్లి గోండుగూడకు చెందిన కుర్సెంగ వినయ్‌కుమార్, ఆత్రం శారదాబాయి, కుర్సెంగ కమలాబాయి, ఆత్రం లక్ష్మీబాయి, ఆత్రం పరమేశ్వర్, ఆత్రం దత్త, అడ యమునాబాయి, ఆత్రం భీంబాయి, చిన్నారులు ఆత్రం లాల్‌ప్రసాద్, భీంబాయి, అరుంధతిలు ఆదిలాబాద్‌లో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి టాటాఏస్ వాహనంలో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో రాత్రి పది గంటల సమయంలో జైనూర్ మండలం తిమ్కపల్లి వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి బోల్తాపడింది.
దీంతో ఆత్రం భీంబాయి(30) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. అందులో ప్రయాణిస్తున్న మరో పది మందికి గాయాలు కావడంతో ఉట్నూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భీంబాయి మృతితో ఆమె కుమారుడు(నెల రోజులు) తల్లి ప్రేమకు దూరమయ్యాడు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు దురె కేశవ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. డ్రైవర్ తాగి ఉండడాన్ని గమనించి వేగంగా వెళ్లవద్దంటూ వారించినా వినలేదని, అతివేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు ఆరోపించారు.