‘అడవిలో అరాచకం’పై అట్టుడికిన తాడ్వాయి
నాలుగు గంటలపాటు వివిధ పార్టీల నేతల ధర్నా
ఎస్ఎస్ తాడ్వాయి: అటవీశాఖ దాడులకు గురైన గొత్తికోయలకు న్యాయం చేయాలని, దాడికి పాల్పడిన అధికారులపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఇక్కడకు రావాలని ప్రతిపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలం జలగలంచ అటవీ ప్రాంతంలోని గొత్తి కోయలపై శనివారం అటవీశాఖ అధికారుల దాడికి నిరసనగా ఆదివాసీ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో తాడ్వాయి ఫారెస్ట్ కార్యాలయం ఎదుట ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వివిధ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరిగింది.
అధికారులు స్పందించకపోవడంతో నాయకులు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించారు. గిరిజనులపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆదివాసీ సంఘాల నాయకులు, పార్టీల నాయకులు ధ్వజమెత్తారు. ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీమంత్రి బలరాంనాయక్, ములుగు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. వలస వచ్చిన ఆదివాసీలపై దాడులకు పాల్పడడం ఈ ప్రభుత్వానికే చెల్లుబాటు అవుతుందన్నారు.
కలెక్టర్ సమాధానంపై నేతల అసహనం
దాడి ఘటనపై మాట్లాడేందుకు కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ జయశంకర్ భూపా లపల్లి జిల్లా కలెక్టర్ మురళితో ఫోన్లో మాట్లాడారు. ‘ఏం జరిగిందో నాకేం తెలియదు. అయినా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గొత్తికోయల గురించి ఎందుకు సార్’ అని కలెక్టర్ సమాధానం ఇవ్వడంతో బలరాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఐఏఎస్ అధికారి అయిఉండి ఏం మాట్లాడుతున్నావ్.. ఛత్తీస్‌గఢ్ గొత్తికోయలు అయితే మనుషులు కాదా .. అని ప్రశ్నించారు. ఈ సంభాషణ జరుగుతుండగానే ఫోన్ కట్ అయింది. సీతక్క కూడా కలెక్టర్‌తో ఈ విషయంపై ఫోన్లో మాట్లాడగా.. తనకేం తెలియదని కలెక్టర్ సమాధానం ఇచ్చారు.
గూడేనికి తరలిన గొత్తికోయలు..
ధర్నా చేస్తున్న పలు పార్టీల నాయకులతో ములుగు డీఎస్పీ దక్షిణామూర్తి ఫోన్లో మాట్లాడారు. తాడ్వాయి అటవీశాఖ అధికారులు పడేసిన సామగ్రిని గూడేనికి తరలించి వారికి భోజన వసతి కల్పించాలన్న నాయకుల డిమాండ్ మేరకు పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అలాగే గిరిజనులపై జరిగిన దాడిపై ఆదివాసీ ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల నాయకులతో ఏటూరునాగారంలోని ఐటీడీఏ కార్యాలయంలో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో చక్రధర్ ఫోన్లో హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.