రామ్‌దేవ్ నూడుల్స్ ఉండగా.. మిగతావి దండగ!
►ఆటా నూడుల్స్ విడుదల చేసిన పతంజలి ఆయుర్వేద
►సోషల్ మీడియాలో ఇప్పటికే రాందేవ్ నూడుల్స్ హల్చల్
►మ్యాగీకి ఇది ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అంటున్న యోగా గురు
మ్యాగీ నూడుల్స్ నిషేధానికి గురైనప్పటి నుంచి పిల్లలకు స్నాక్ ఐటం ఏం పెట్టాలో తెలియక తికమక పడుతున్న తల్లులకు.. రెండు నిమిషాల్లో కడుపు నింపే ఆహారం దూరమైపోయిందని బాధపడుతున్న బ్యాచిలర్లకు తియ్యటి శుభవార్త. విదేశీ మ్యాగీకి ప్రత్యామ్నాయంగా ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబా.. స్వచ్ఛమైన స్వదేశీ ఆటా (గోధుమ పిండి) నూడుల్స్ తయారుచేయించి మార్కెట్ లోకి విడుదల చేశారు.
ఇప్పటికే ఆయుర్వేద ఔషధాలు, ఆహార ఉత్పత్తులు, ఆరోగ్య రక్షణ ఉత్పత్తులు, పళ్లరసాలను ఉత్పతత్తి చేస్తున్న తమ సంస్థ పతంజలి ఆయుర్వేద లిమిటెడ్.. కొత్తగా ఆటా నూడుల్స్ తయారుచేస్తున్నదని, ఇందులో ఒక్క ఔన్సు కూడా మైదా(పిండి)ని కలపలేదని, ఇది మ్యాగీ స్థానంలో ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉండగలదని రామ్‌దేవ్ అన్నారు.
గురువారం హరిద్వార్‌లోని తన ఆశ్రమంలో రామ్‌దేవ్ ఆటా నూడుల్స్ ఉత్పత్తుల విక్రయాలను ఆయన ప్రారంభించారు. కాగా, ఇప్పటికే వీటిని తిన్నవారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని చెప్పారు.. 'రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ' అని. మోతాదుకు మించి సీసం, ఇతర రసాయనాలు ఉన్నాయని తేలడంతో దేశవ్యాప్తంగా మ్యాగీ నూడుల్స్ పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.