attack against women
-
రాలేదంటే యాసిడ్ పోసి చంపేస్తా..
సాక్షి, హైదరాబాద్: తాను చెప్పినట్లు నడుచుకోకపోయినా.. తాను రమ్మన్నప్పుడు రాకున్నా.. ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా యాసిడ్ పోసి చంపేయడమే కాకుండా మొత్తం కుటుంబాన్ని అంతు చేస్తానని వివాహితను బెదిరించిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమిన ల్‌కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన వివాహిత(28) టైలర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజు గత కొంతకాలంగా ఆమె షాపు వద్దకు వచ్చి వేధిపులకు పాల్పడుతున్నాడు. ఆమె వెంటపడటమేగాక, తన మాట వినకపోతే తన దగ్గరికి రాకపోతే యాసిడ్ పోసి చంపుతానని బెదిరించసాగాడు. రెండు రోజుల క్రితం ఆమె పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన రాజు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా తన బైక్‌పై ఎక్కాల్సిందిగా ఆదేశించాడు. దీన్ని గమనించిన ఆమె భర్త, తల్లి, అత్తతో పాటు స్థానికులు ఏం చేస్తున్నావని ప్రశ్నించగా తన మాట వినకపోతే మీ అందరినీ చంపేస్తానంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. -
ఎందుకు వచ్చావంటూ.. భార్యపై భర్త దాడి
సాక్షి, నెక్కొండ: భార్యపై భర్త దాడి చేయడంతో మనస్తాపానికి గురై భార్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని గుండ్రపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్, గ్రామస్తుల కథనం ప్రకారం... వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లనాగారంకు చెందిన సంగీత, గుండ్రపల్లి గ్రామానికి చెందిన భూపతి ప్రకాశ్‌లు ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. కొంత కాలం కలిసి ఉండగా వీరి మధ్య మనస్పర్థలు రావడంతో సంగీతకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తన భర్త కోసం గుండ్రపల్లిలో ఉన్న అత్తారింటికి వచ్చి ఆమె గతంలో గొడవకు దిగింది. దీంతో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టగా ఇద్దరు కలిసి ఉండాలని చెప్పారు. కొన్ని నెలలు కలిసి ఉన్నప్పటికీ వీరి మధ్య మళ్లీ గొడవలు జరగడంతో ప్రకాశ్ విడాకుల కోసం నోటీసు పంపించాడు. దాంతో నాలుగు రోజుల క్రితం గుండ్రపల్లి వచ్చి భర్త జాడ తెలపాలని ప్రకాశ్ తల్లిదండ్రులను కోరింది. ప్రకాశ్ ఇక్కడికి రాలేదని, ఆమెను వారు ఇంట్లోకి రానివ్వలేదు. సోమవారం భర్త వచ్చిన విషయం తెలుసుకొని సంగీత ప్రకాశ్ ఇంటికి వచ్చింది. కేసు కోర్టులో ఉండగా ఎందుకు వచ్చావంటూ భర్త ప్రకాశ్ కోపోద్రికుడై ఆమెపై దాడికి దిగాడు. దాంతో మనస్తాపానికి గురైన సంగీత పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఎస్సై తన వాహనంలో చికిత్స నిమిత్తం నెక్కొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం నర్సంపేటకు 108 వాహనంలో తరలించారు. తండ్రి లేడు..తల్లి కాదందీ..భర్తతో ఉంటా:బాధితురాలు సంగీత ప్రేమించి పెండ్లి చేసుకున్నా.. తండ్రి లేడు, ఉన్నా తల్లి కాందటోంది... భర్త తోడు కరువవడంతో మనస్తాపానికి గురయ్యాను. భర్త కాదంటే ఆత్మహత్యే శరణ్యం. అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలి. నెక్కొండలో చికిత్స పొందుతున్న సంగీత -
భర్తను కొట్టి భార్యను ఎత్తుకెళ్లే యత్నం
సాక్షి, గుంటూరుఈస్ట్: భార్యాభర్తలను కొట్టి, ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళను లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు ఓ కిరాతకుడు. చుట్టు పక్కల వారు అడ్డుకుని, బాధితులను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం గురువారం బాధితులు పాతగుంటూరు పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు ములుగూరి రాణి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు రూరల్ మండలం బుడంపాడు ఎస్సీ కాలనీకి చెందిన ములుగూరి రాణికి చిన్నతనంలోనే తల్లి, తండ్రి చనిపోవడంతో షాపుల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. 2017 ఆగస్టులో పాతగుంటూరుకు చెందిన ఎం.శ్రీనివాస్‌ను ప్రేమించి, కులాంతర వివాహం చేసుకుంది. ఆర్టీసీ కాలనీ 5వ లైనులో కాపురం పెట్టారు. ఈనెల 25న పాత స్నేహితుడైన శారదాకాలనీకి చెందిన వివాహితుడు తురకా సునీల్ ఆమె ఇంటికి వచ్చి భర్తను వదిలేసి తన వెంట రావాలంటూ ఒత్తిడి చేశాడు. రాణి తిరస్కరించడంతో తీవ్రంగా కొట్టి ఆమె సెల్‌ఫోన్ పగులకొట్టాడు. ఇంటికి చేరుకున్న భర్త శ్రీనివాస్‌ను కూడా కొట్టి ఆమెను వదిలిపెట్టి వెళ్లాలని బెదిరించాడు. చుట్టుపక్కల వారు కలుగజేసుకుని సునీల్‌ను వారించి పంపించి వేశారు. అదే రోజు రాత్రి 11.30 గంటల సమయంలో సునీల్ తన మిత్రుడు రామారావును వెంటపెట్టుకుని మళ్లీ రాణి ఇంటికి వచ్చి భార్యా భర్తలిద్దరిని తీవ్రంగా కొట్టారు. ఆమె మెడలోని గొలుసును, చేతి పర్సులో ఉన్న మరో బంగారు గొలుసును లాక్కున్నారు. గొడవను గమనించిన చుట్టు పక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చి పిలిపించడంతో విషయాన్ని తెలుసుకుని సునీల్, రామారావు అక్కడి నుంచి పరారయ్యారు. గర్భంపై తన్నిన నిందితుడు ఆరు నెలల గర్భిణి అయిన రాణి పొట్ట మీద మీద, నడుము మీద సునీల్ తన్ని, కొట్టి గాయపరిచాడు. గురువారం దంపతులు ఇద్దరు పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సునీల్ నేర స్వభావం కలవాడని, అతనికి ఉన్న పలుకుబడితో ప్రాణాలు తీయడానికైనా వెనుకాడడని రాణి కన్నీరుమున్నీరయింది. తనకు తన భర్తకు ఎటువంటి అండ లేని కారణంగా పోలీసులే రక్షణ కల్పించాలని వేడుకుంది. -
మహిళలపై దుండగుడి దాడి
కర్రతో కొట్టడంతో ఇద్దరికి గాయాలు కేకలు వేయడంతో పలాయనం పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగింత మతిస్థిమితం లేదని సమాచారం గతంలో జరిగిన బైక్ దొంగతనాలతో సంబంధాలున్నట్లు అనుమానం ముదినేపల్లి రూరల్ : ఉభయ గోదావరి జిల్లాల్లో సూది సైకోగాళ్లు సంచలనం సృష్టిస్తుండగా తాజాగా ముదినేపల్లి మండలంలో ఆదివారంఒక వ్యక్తి ఇద్దరు మహిళలపై దాడిచేయడం స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పెదగొన్నూరు శివారు ఉప్పరగూడెంకు చెందిన మహిళలు స్థానిక పెదలంక డ్రెయిన్‌లో బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు. ఈక్రమంలో గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, కలిదిండి ధనలక్ష్మి పెదలంక డ్రెయిన్‌పై ఉన్న వంతెన సమీపంలో ఆదివారం బట్టలు ఉతుకుతున్నారు. అదే సమయంలో ఒక అపరిచిత వ్యక్తి కర్ర, కత్తి, తాడుతో హఠాత్తుగా దాడి చేశాడు. కర్రతో తలలపై కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానిక యువకులు పరుగున వచ్చారు. వారిని గమనించిన సదరు వ్యక్తి సమీప పొలాల్లోకి పారిపోయాడు. యువకులు తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. చినవాడవల్లి సమీపంలోని వరి పొలాల్లో దాక్కుని ఉన్న దుండగుడిని ఎట్టకేలకు పట్టుకుని గ్రామానికి తీసుకువచ్చి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో ముదినేపల్లి పోలీసులు దుండగుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత మహిళలను స్థానికులు 108 అంబులెన్సులో గుడివాడలో ఏరియా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మతి స్థిమితం లేకే... దుండగుడిని గుడ్లవల్లేరు మండలం అంగలూరుకు చెందిన ఈడే ఏడుకొండలుగా గుర్తించినట్లు తెలిసింది. పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం అత్తవారిల్లు కాగా కొంతకాలంగా మతి స్థిమితం లేకపోవడంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏడుకొండలు గురించి స్థానిక పోలీసు లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని మోటార్ బైక్ దొంగతనం కేసుల్లో ఏడు కొండలు పాత్ర ఉన్నట్లు అనుమానించి విచారిస్తున్నట్లు సమాచారం.