కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేగింది. ఎన్నికల టిక్కెట్ల కేటాయింపుతో కాంగ్రెస్ పార్టీలో ఇక్కట్లు మొదలయ్యాయి. ఏలూరు అసెంబ్లీ స్థానాన్ని వెంకట పద్మరాజుకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంపై యూత్ కార్యకర్తలు దాడి చేశారు. వెంకట పద్మరాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కుర్చీలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదివారం రాత్రి లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఏలూరు లోక్సభ టిక్కెట్ లిక్కర్ సిండికేట్ ముసునూరి నాగేశ్వరరావుకు ఇచ్చారు. నాగేశ్వరరావు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించినా లభించలేదు. కాంగ్రెస్ కుదేలవడంతో ఇప్పుడు ఏకంగా లోక్సభకే పోటీచేసే అవకాశం దక్కింది.