అక్రమ నిర్మాణం వద్దన్నందుకు..
కత్తులతో దాడి, ఒకరికి గాయాలు
బంజారాహిల్స్: మజీదుకు చెందిన స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతుండటంపై ప్రశ్నించినందుకు కత్తులతో దాడి చేసిన సంఘటన మంగళవారం బంజారాహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బంజారాహిల్స్ రోడ్ నెం.11లో ఇండో అరబ్లీగ్కు చెందిన స్థలంలో ఉన్న మజీదు గ్రౌండ్‌ఫ్లోర్‌లో హోటల్ నిర్వహిస్తున్న వ్యక్తి దానిని బార్కాస్‌కు చెందిన సౌద్ అమోదీకి సబ్ లీజ్‌కు ఇచ్చాడు. అయితే హోటల్ ఎదురుగా ఉన్న స్థలంలో సౌద్ అక్రమ నిర్మాణం చేపడుతుండటంతో ఇక్రమ్ అడ్డుకున్నాడు.
నిర్మాణం చేపడితే మజీదు కనిపించకుండా పోతుందని, ఇప్పటికే అక్రమంగా నడుస్తున్న హోటల్‌ను మూసేయాలని జీహెచ్ఎంసీ క్లోజర్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో సౌద్ తన అనుచరులతో కలిసి కర్రలు, కత్తులతో దాడి చేయడంతో ఇక్రమ్‌కు తీవ్రగాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఇక్రమ్ కారును ధ్వంసం చేసి పరారయ్యారు. పోలీసులు నిందితులకు చెందిన ఆడికారును స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.