విస్మయం రేపుతున్న లండన్ ఉన్మాది ఫొటోలు!
లండన్‌లో ఉగ్రవాద దాడికి పాల్పడిన దుండగుడి ఫొటోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కత్తులతో విరుచుకుపడి లండన్‌ను గగుర్పాటుకు గురిచేసిన దుండుగుడు పోలీసుల కాల్పుల్లో గాయపడిన అనంతరం అంబులెన్స్ సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అతడు ప్రాణాలు విడిచాడు. ఈ సందర్భంగా అంబులెన్స్ సిబ్బంది స్ట్రెచర్‌లో అతన్ని తరలిస్తుండగా తీసిన ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. విస్మయం కలిగించేరీతిలో ఉన్న ఈ ఫొటోలలో దుండగుడు ఉపయోగించిన రెండు కత్తులు సైతం ఉండటం గమనార్హం.
బ్రిటన్ పార్లమెంటు లక్ష్యంగా బీభత్సానికి తెగబడిన నిందితుడు ఆసియాకు చెందిన వాడని, అతని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. రూ. 26 లక్షలు (32వేల పౌండ్లు) విలువచేసే హ్యుండయ్ కారులో దూసుకొచ్చిన అతను వెస్ట్‌మినిష్టర్ బ్రిడ్జ్‌పై విచక్షణారహితంగా వాహనాన్ని నడుపుతూ 40మందిని గాయపర్చాడు. అనంతరం నేరుగా పార్లమెంటు గేటు ముందుకు దూసుకుపోయి.. అక్కడ ఓ పోలీసు అధికారిని పొడిచిచంపారు. అనంతరం పోలీసుల చేతిలో మరణించాడు. ఈ దాడిలో మొత్తం ఐదుగురు ప్రాణాలు విడిచారు. నిందితుడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అతను ఉపయోగించిన కారు విలాసవంతమైన ఎస్సెక్స్ ప్రాంతానికి చెందినదిగా రిజిస్టర్ అయి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ ఇస్లామిక్ ఉగ్రవాద అనుబంధ ఘటనగానే దీనిని భావిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు.