చోరీకి యత్నించి..ఇరుక్కుపోయాడు!
మేడ్చల్ (రంగారెడ్డి జిల్లా) : ఓ వ్యక్తి మద్యం దుకాణంలో దొంగతనానికి యత్నించి.. ఆనక పైకప్పు రేకుల్లో ఇరుక్కుపోయి, పోలీసులకు చిక్కాడు. ఘటన వివరాల్లోకి వెళ్తే... మేడ్చల్‌కు చెందిన శంకర్ అనే వ్యక్తి బుధవారం రాత్రి స్థానిక రంగసాయి వైన్స్‌లో దొంగతనానికి యత్నించాడు. మద్యం దుకాణం పైకప్పు రేకులకు రంధ్రం చేసి లోపలికి దూరేందుకు యత్నించాడు. ఆ క్రమంలో అతడు రంధ్రంలోనే ఇరుక్కుపోయాడు.
పైకి రాలేక, కిందికి దిగలేక రాత్రంతా అవస్థలు పడుతూనే ఉన్నాడు. గురువారం ఉదయం కేకలు వేస్తుండటంతో అటుగా వెళ్లేవారు అతనిని గమనించి, దుకాణం యజమానికి తెలిపారు. ఆయన వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అంతా కలసి శంకర్‌ను రక్షించారు. అయితే రేకులు చీరుకుపోయి ఒళ్లంతా గాయాలైన శంకర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సీఐ శశాంకరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.