దళితులపై ఉమ్మడి దాడులు
రియల్టరుగా మారిన చంద్రబాబు
కులనిర్మూలన పోరాట సమితి
రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్
తెనాలి : దళిత, పీడిత కులాల ప్రజలపై దేశంలోని అగ్రకుల భూస్వామ్య పాలకులు, హిందూ మతోన్మాదులు, సామ్రాజ్యవాదులు కలిసి ఉమ్మడిగా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక దాడులకు తెగబడుతున్నారని కులనిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆరోపించారు. జూలై 17 (కారంచేడు) నుంచి ఆగస్టు 6 (చుండూరు వరకు) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర ముగింపు సభ శనివారం ఇక్కడి ఎన్జీవో కల్యాణమండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దళితులపై కులపరమైన దాడులు, ముస్లింలు, క్రైస్తవులపై మతపరమైన దాడులు, జనాభాలో 55 శాతంగా వున్న బీసీలపై ఆర్థికపరమైన దాడులు జరుగుతున్నాయని చెప్పారు. 15 లక్షల భూబ్యాంకు ఏర్పాటు చేశామంటూ విదేశీ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత, పీడిత కులాల భూముల్ని లాక్కోవటమే కాకుండా లక్షలాది తీరప్రాంత ప్రజలను నిరాశ్రయుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. నగర సుందరీకరణ పేరుతో నిరుపేదల్ని నిరాశ్రయుల్ని చేసే పనిలో ఉన్నారన్నారు. రియల్టర్‌గా మారిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజావ్యతిరేక చర్యలను ప్రజల ద్వారా అడ్డుకొంటామని హెచ్చరించారు.