'ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం'
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించేందుకు విద్యార్థులు కలిసి రావాలని ఏయూ సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ అబ్బులు పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాపై విశాఖపట్నంలోని పోర్టు కళావాణి ఆడిటోరియంలో జరుగుతున్న యువభేరిలో ఆయన ప్రసంగించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
'ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్లాయి. టీడీపీ ప్రభుత్వం, తర్వాత వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. వీటన్నింటిలో ఓ ప్రత్యేకత గల నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఆయన అమలు చేసిన విధానాల వల్ల స్కూలు టీచర్ల దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజి వరకు అన్నిచోట్లా నియామకాలు జరిగాయి. విద్యార్థులు కూడా మేలు పొందారు. ఎన్నో రాజకీయ క్రీడల తర్వాత మన రాష్ట్రాన్ని విభజించారు. ఆ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. వాటిలో ఒకటి ప్రత్యేక హోదా. అది వస్తే, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి. అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
సింగపూర్, థాయ్లాండ్, జర్మనీ వెళ్లి వాళ్లను బతిమాలుతున్నాం. పరిశ్రమలు పెట్టి మా నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని వేడుకుంటున్నాం. ప్రత్యేక హోదా వస్తే, వాళ్లంతట వాళ్లే వచ్చి దాని సౌలభ్యాలతో పరిశ్రమలు నెలకొల్పుతారు, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తారు. ఈ ఉద్యమం ఏ ఒక్కరి సంక్షేమం కోసమో చేస్తున్నది కాదు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. రాష్ట్ర సంక్షేమం కోసం చేస్తున్న పోరాటం కాబట్టి ఈ పోరాటంలో విద్యార్థులు అందరూ సహకరించాలి' అని కోరారు.