ఉత్సాహంగా వికలాంగుల ఆటల పోటీలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్:
ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి వికలాంగుల ఆటల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పాఠశాలల విద్యార్థులు మార్చ్‌పాస్ట్ అనంతరం గౌరవ వందనాన్ని సమర్పించి జాతీయ గీతాన్ని అలపించారు. మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జిల్లాలోని 23 ప్రత్యేక పాఠశాలలకు చెందిన వికలాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. వందర మీటర్ల పరుగుతో పోటీలు ఆరంభమయ్యాయి.
జూనియర్, సీనియర్ విభాగాల్లో రన్నింగ్, షాట్‌పుట్, క్యారమ్స్, చెస్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వికలాంగుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు నర్సింహులు, అదనపు జాయింట్ కలెక్టర్ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.