గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడూరు మండలం గరగపర్రులో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ గురువారం ఛలో గరగపర్రుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ అమలుచేశారు. గ్రామంలోకి వెళ్లే అన్ని మార్గాలలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి,పోలీసులు భారీగా మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. గుర్తింపు కార్డు లేనివారిని గ్రామంలోకి అనుమతించడం లేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా సెక్షన్ 30 అమల్లో ఉందన్నారు. ఇప్పుడిప్పుడే గరగపర్రులో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, అనుమతి లేనిదే విద్యార్థులు రాకూడదన్నారు. మరోవైపు ఛలో గరగపర్రు కార్యాక్రమాన్ని ఏయూ విద్యార్థి జేఏసీ వాయిదా వేసింది. ఈ నెల 19న ఛలో గరగపర్రు చేపట్టనున్నట్లు ఏయూ విద్యార్థి జేఏసీ నేత ఆరేటి మహేష్ తెలిపారు.