గ్రాన్యూల్స్ ఇండియా చేతికి ఆక్టస్ ఫార్మా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫార్మా సంస్థ గ్రాన్యూల్స్ ఇండియా తాజాగా ఆక్టస్ ఫార్మాను కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. అయితే, ఈ డీల్ విలువ సుమారు రూ. 120 కోట్లు ఉంటుంది. కొనుగోలు ప్రక్రియ పూర్తి కావడానికి 3-6 నెలలు పట్టవచ్చని గ్రాన్యూల్స్ ఇండియా ఎండీ కృష్ణప్రసాద్ తెలిపారు.
ఔషధంలో కీలక భాగంగా ఉండే యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ) తయారు చేసే ఆక్టస్ ఫార్మాకి.. వైజాగ్‌లోని ఫార్మా సిటీలోను హైదరాబాద్‌లోను ప్లాంట్లు ఉన్నాయి. వైజాగ్‌లోని ఆక్టస్ ప్లాంటుకు అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏతో పాటు ఇతర దేశాల నియంత్రణ సంస్థల నుంచి కూడా అనుమతులు ఉన్న నేపథ్యంలో ఈ కొనుగోలు తమకు మరింతగా ఉపయోగకరంగా ఉండగలదని కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆక్టస్ పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం 12 ఏపీఐలు ఉన్నాయి. 50 దేశాల్లోని కస్టమర్లకు విక్రయిస్తోంది. మరోవైపు, జనరిక్ ఏపీఐలను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లో 10,000 చ.అ. ఆర్అండ్డీ కేంద్రాన్ని ప్రారంభించినట్లు గ్రాన్యూల్స్ ఇండియా పేర్కొంది.