August 16 1947: ఇది చాలా స్పెషల్ మూవీ
‘‘1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని మనందరికీ తెలుసు. కానీ అడవి మధ్యలో ఉండే ఓ కొండ ప్రాంతంలోని ఓ ఊరు ప్రజలకు ఈ విషయాన్ని ఓ కారణం చేత బ్రిటిష్ అధికారులు చెప్పరు. దీంతో అక్కడి ప్రజలు స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే ఉంటారు. వ్యక్తిగతంగా వారందరికీ ఆగస్టు 16న స్వాతంత్య్రం. అయితే 1947 ఆగస్టు 14, 15, 16.. ఈ మూడు రోజుల్లో ఆ ఊళ్లో ఏం జరిగింది? అనే విషయం ఆసక్తికరం. ఇది చాలా స్పెషల్ మూవీ’’ అన్నారు దర్శక–నిర్మాత ఏఆర్ మురుగదాస్.
గౌతమ్ కార్తీక్ హీరోగా ఎన్.ఎస్. పొన్కుమార్ దర్శకత్వంలో రూపొందిన పీరియాడికల్ ఫిల్మ్ ‘ఆగస్టు 16, 1947’. దర్శకుడు ఏఆర్ మురుగదాస్, ఓం ప్రకాష్ భట్, నర్సిరామ్ చౌదరి నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 14న నిర్మాత ఎన్వీ ప్రసాద్ తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ‘‘ఎప్పటికీ గుర్తుండిపోయే కథ ఇది’’ అన్నారు గౌతమ్ కార్తీక్. ‘‘ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించాలి’’ అన్నారు పొన్కుమార్. ‘‘ఆగస్టు 16, 1947’ ప్రత్యేకంగా ఉంటుంది. క్లయిమాక్స్ అద్భుతంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత ‘ఠాగూర్’ మధు.