పెళ్లిలో కాల్పులతో మాతాజీ హల్చల్
ఉత్తరాదిలో ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగాయంటే అక్కడ సరదాగా తుపాకులు పట్టుకుని గాల్లోకి కాల్పులు జరపడం సర్వసాధారణం. హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఇలాగే ఓ పెళ్లి జరుగుతుంటే అక్కడకు హాజరైన సాధ్వి, ఆమె అనుచరులు కాల్పులు జరపడంతో ఒక మహిళ మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సాధ్వి దేవా ఠాకూర్‌తో పాటు ఆమె భద్రతా సిబ్బంది కూడా తుపాకులతో కాల్చడంతో పెళ్లికొడుకు మేనత్త మరణించింది.
దాంతో ఆమెపైన, భద్రతా సిబ్బందిపైన పోలీసులు ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్లతో పాటు హత్య కేసు కూడా నమోదు చేశారు. వాళ్లంతా ముందుగా డాన్స్ ఫ్లోర్ వైపు గురిచూసి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అక్కడున్న వరుడి మేనత్త అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాంతో సాధ్వి, ఆమె శిష్యగణం అక్కడి నుంచి చల్లగా జారుకున్నారు. కర్నల్ రైల్వేస్టేషన్ సమీపంలోని సావిత్రి లాన్స్ అనే కళ్యాణమండపంలో ఈ ఘటన జరిగింది. నిందితులను అరెస్టుచేసేందుకు పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.