'రామాలయానికి బాబర్‌కు ఏమిటీ సంబంధం?'
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయం ఔరంగజేబు పాలనా హయాంలో ధ్వంసమైందని.. బాబర్ కమాండర్ మిర్ బాకీ చేతిలో కాదని ఐపీఎస్ మాజీ అధికారి కిషోర్ కునాల్ తెలిపారు. ఆయన తాజాగా రాసిన అయోధ్య రీవిజిటెడ్(అయోధ్య పునర్దర్శనం) అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించాడు. 1990లో కేంద్ర హోంశాఖలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1813-14 ప్రాంతంలో ప్రాన్సిస్ బుచానన్ అయోధ్యలో సర్వే చేసి బాబర్ గురించి తప్పుగా పేర్కొన్నారని చెప్పారు.
అయోధ్యలోని రామాలయ కూల్చివేతలో అసలు బాబర్‌కు ఎలాంటి పాత్ర లేదని, అక్కడ మసీదు నిర్మాణంలో కూడా ఆయనకు సంబంధం లేదని అన్నారు. గత రెండు వందల ఏళ్లుగా బాబర్ కు సంబంధం లేని విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. బాబర్ చాలా చక్కగా పరిపాలించాడని, స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాడని ఆయనకు రామాలయం నేలమట్టంతో సంబంధం లేదన్నారు. 1660లో ఔరంగజేబు పాలిస్తున్నప్పుడు ఆయన అవాద్ గవర్నర్ ఫెదాయ్ ఖాన్ కూల్చివేశాడని చెప్పారు. ప్రస్తుతం అందరూ భావిస్తున్నట్లు రామాలయం 1528లో ధ్వంసం కాలేదన్నారు.