Australia-A
-
భారత్ ‘ఎ’ గెలుపు
బెంగళూరు: స్పిన్నర్లు చెలరేగడంతో ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో ముగించింది. ఆట చివరిరోజు మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 38/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ 213 పరుగులకు ఆలౌటైంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, కృష్ణప్ప గౌతమ్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. నదీమ్‌కు రెండు వికెట్లు దక్కాయి. 8 ఓవర్లలో 55 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దానిని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ (3), శుబ్‌మన్ గిల్ (4), కృష్ణప్ప గౌతమ్ (1), భరత్ (12) ఔటవ్వగా... అంకిత్ బావ్నే (18 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు), సమర్థ్ (5 నాటౌట్) భారత్ విజయాన్ని ఖాయం చేశారు. సంక్షిప్త స్కోర్లు ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 346; భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 505; ఆస్ట్రేలియా ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 213 (హ్యాండ్స్కోంబ్ 56, మార్‡్ష 36, చహర్ 2/30, నదీమ్ 2/67, గౌతమ్ 3/39, కుల్దీప్ 3/46); భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: 55/4. -
భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
మకే(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్రాంగులర్ క్రికెట్ సిరీస్‌ను భారత -ఎ జట్టు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన భారత కుర్రాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవ్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ్ నాయర్(1) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్(95;108 బంతుల్లో 11 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఐయ్యర్(41), మనీష్ పాండే(61) ఆకట్టుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు నమోదు చేసింది. ఇక చివర్లో కేదర్ జాదవ్(25 నాటౌట్), అక్షర్ పటేల్(22నాటౌట్ ) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆపై బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 44.5 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.ఆసీస్ జట్టును భారత స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ చావు దెబ్బ తీశాడు. చాహల్ 8.5 ఓవర్లలో 34 పరుగుల ఇచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. అతనికి జతగా కులకర్ణి, నాయర్, అక్షర్‌లు తలో రెండు వికెట్లు సాధించడంతో భారత ఘన విజయం సొంతం చేసుకుంది. భారత ఆటగాడు మన్ దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
పోరాడి ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు పోరాడి ఓడింది. మ్యాక్స్‌వెల్ (79 బంతుల్లో 145 నాటౌట్, 18 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు చేసింది. నిక్ మెడిన్సన్ (56 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లు షమీ, నదీమ్, శిఖర్ ధావన్ తలా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ 36.2 ఓవర్లలో 152 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, భారీ సిక్సర్లతో ఆసీస్ స్కోరును అమాంతం పెంచేశాడు. దీంతో చివరి 13.4 ఓవర్లలో ఆస్ట్రేలియా-ఎ జట్టు 146 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లకు 291 పరుగులు చేయగలిగింది. ఏపీ క్రికెటర్ రాయుడు (56 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రైనా (79 బంతుల్లో 83, 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (87 బంతుల్లో 66, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయారు. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ వేసిన నైల్... రాయుడుతో పాటు, స్టువర్ట్ బిన్నీ (0)ని ఔట్ చేయడమే కాకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.