పోరాడి ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు పోరాడి ఓడింది. మ్యాక్స్‌వెల్ (79 బంతుల్లో 145 నాటౌట్, 18 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు చేసింది.
నిక్ మెడిన్సన్ (56 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లు షమీ, నదీమ్, శిఖర్ ధావన్ తలా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ 36.2 ఓవర్లలో 152 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, భారీ సిక్సర్లతో ఆసీస్ స్కోరును అమాంతం పెంచేశాడు.
దీంతో చివరి 13.4 ఓవర్లలో ఆస్ట్రేలియా-ఎ జట్టు 146 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లకు 291 పరుగులు చేయగలిగింది. ఏపీ క్రికెటర్ రాయుడు (56 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రైనా (79 బంతుల్లో 83, 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (87 బంతుల్లో 66, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయారు. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ వేసిన నైల్... రాయుడుతో పాటు, స్టువర్ట్ బిన్నీ (0)ని ఔట్ చేయడమే కాకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.