ప్రిటోరియా: ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ జట్టు బోణి చేసింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 18 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం)తో దక్షిణాఫ్రికా-ఎ పై విజయం సాధించింది. దీంతో భారత్‌కు 4 పాయింట్లు లభించాయి. ఎల్‌సీ డివిలియర్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లు కుదించారు. ప్రొటీస్ జట్టు టాస్ గెలవగా... మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లకు 309 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాప్ ఆర్డర్‌లో ధావన్ (67 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (65 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రైనా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వరద పారించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 34.4 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. డక్‌వర్త్ ప్రకారం ప్రొటీస్ జట్టు గెలవాలంటే అప్పటికి 277 పరుగులు చేయాల్సి ఉంది. ఎల్గర్ (72 బంతుల్లో 84; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జార్‌స్వీల్డ్ (61 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసోవ్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు. రసూల్, నదీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉనాద్కట్ ఒక్క వికెట్ పడగొట్టాడు.
భారత్ ‘ఎ’కు తొలి గెలుపు
Published Sat, Aug 10 2013 1:53 AM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
Advertisement