Tringular series
-
పన్నెండున్నరేళ్ల తర్వాత
ఓ టోర్నీ గెలిచిన దక్షిణాఫ్రికా ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఆసీస్‌పై విజయం హరారే: దక్షిణాఫ్రికా జట్టు పన్నెండున్నర సంవత్సరాల తర్వాత ఓ టోర్నీ టైటిల్ గెలవగలిగింది. 2002 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ముక్కోణపు టోర్నీ టైటిల్ గెలిచాక సఫారీలు ఎక్కడా ఏ వన్డే టోర్నీ టైటిల్ గెలవలేదు. ద్వైపాక్షిక సిరీస్‌లు మాత్రం గెలిచారు. ఈ లోటును శనివారం తీర్చుకున్నారు. డుఫ్లెసిస్ (99 బంతుల్లో 96; 8 ఫోర్లు; 1 సిక్స్) విజృంభణతో ముక్కోణపు టోర్నీ ఫైనల్లో దక్షిణాఫ్రికా 6 వికెట్లతో ఆస్ట్రేలియాపై గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు చేసింది. పేసర్ డేల్ స్టెయిన్ (4/34) ధాటికి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది. ఓపెనర్ ఫించ్ (87 బంతుల్లో 54; 5 ఫోర్లు) మాత్రమే రాణించాడు. చివర్లో ఫాల్క్‌నర్ (37 బంతుల్లో 39; 4 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. మోర్కెల్, పార్నెల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 221 పరుగులు చేసి నెగ్గింది. ఆమ్లా (75 బంతుల్లో 51; 2 ఫోర్లు), డివిలియర్స్ (41 బంతుల్లో 57; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగో వికెట్‌కు డివిలియర్స్, డు ప్లెసిస్ కలిసి 91 పరుగులు జత చేశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు సిరీస్ కూడా డు ప్లెసిస్‌కు దక్కింది. -
నేటి నుంచి ‘నంబర్‌వన్’ పోరాటం
మ. గం. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్.... ఈ హోదా ఉన్న జట్టు ఎలా ఆడాలో భారత్ అలాగే ఆడుతోంది. వన్డేల్లో ఇటీవల కాలంలో ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించగలమనే ధీమాను చూపలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు ఏడు వన్డేల సిరీస్ ఆడేందుకు భారత్ వచ్చింది. అది కూడా 6-1తో సిరీస్ గెలిస్తే నంబర్ వన్ ర్యాంక్ సాధించొచ్చు అనే లక్ష్యంతో. కానీ ప్రస్తుతం ఆ జట్టు పరిస్థితి చూస్తే... కనీసం 4-3తో సిరీస్ గెలవడం కూడా అద్భుతమే అనుకోవాలి. పుణే: చాంపియన్స్ ట్రోఫీ, ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో వన్డే సిరీస్...ఇలా గత మూడు వన్డే టోర్నీలు చూస్తే భారత జట్టు ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతుంది. ఏ ఒక్కరిపైనో ఆధార పడకుండా జట్టులో ప్రతీ ఒక్కరూ తమ బాధ్యత సమర్ధంగా నిర్వర్తిస్తున్నారు. దాంతో ఎలాంటి తడబాటు లేకుండా విజయాలు ధోనిసేన వశమవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ కచ్చితంగా భారత్ ఫేవరెట్. టి20 మ్యాచ్‌లో ఏకంగా 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్... వన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. అసలే అనుభవం లేని ఆటగాళ్లతో ఇబ్బంది పడుతున్న కంగారూలు ఈ సిరీస్ గెలవాలంటే అద్భుతాలు చేయాల్సిందే. ఈ నేపథ్యంలో ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం పుణేలోని సుబ్రతోరాయ్ సహారా స్టేడియంలో జరుగుతుంది. సమష్టితత్వం... టి20లో సంచలన విజయం సాధించిన జట్టుతోనే భారత్ తొలి వన్డేలోనూ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాబట్టి రాయుడు మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, ధోని, జడేజాలతో జట్టు బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. ఇక టి20 మ్యాచ్‌లో 35 బంతుల్లోనే అజేయంగా 77 పరుగులతో చెలరేగి యువరాజ్ ఫామ్‌లోకి రావడం భారత్ బలాన్ని మరింత పెంచింది. ఆ మ్యాచ్‌లో బౌలర్లు విఫలమైనా టి20 కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వన్డేల్లో భువనేశ్వర్, అశ్విన్‌లతో పాటు లెఫ్టార్మ్ స్పిన్నర్ జడేజా కూడా చాలా కాలంగా మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. స్పిన్నర్లను ఎదుర్కోలేని ఆసీస్ కొత్త కుర్రాళ్ల బలహీనతను భారత బౌలర్లు సొమ్ము చేసుకునే అవకాశం ఉంది. ఇరు జట్ల మధ్య భారత్‌లో జరిగిన గత రెండు వన్డేల్లోనూ ధోని టీమ్ గెలిచింది. ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ (2011) తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో వన్డే ఆడలేదు. వాట్సన్ మినహా... క్లార్క్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో ఆస్ట్రేలియా జట్టులో అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కొరత ఏర్పడింది. అందులోనూ భారత గడ్డపై ఎవరూ పెద్దగా ఆడింది లేదు. జట్టులో వాట్సన్, మిచెల్ జాన్సన్లకే వందకుపైగా వన్డేలతో పాటు ఐపీఎల్లో ఎక్కువగా ఆడిన అనుభవం ఉంది. దాంతో వాట్సన్‌పై జట్టు బ్యాటింగ్ ప్రధానంగా ఆధార పడింది. ఇటీవల ఇంగ్లండ్‌తో సిరీస్ నెగ్గడంలో కూడా అతను కీలక పాత్ర పోషించాడు. అయితే టి20 తరహాలో కాకుండా 50 ఓవర్ల పాటు ఆసీస్ నిలబడటం కీలకం. కెప్టెన్ బెయిలీ, ఫించ్, వన్డే స్పెషలిస్ట్ వోజెస్, ఫెర్గూసన్ ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్. మెక్కే, ఫాల్క్‌నర్, కౌల్టర్, వాట్సన్ ప్రధాన బౌలర్లు. ఆల్‌రౌండర్‌గా మ్యాక్స్‌వెల్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. సమర్ధుడైన స్పిన్నర్ లేకపోవడం ఆసీస్ బలహీనత. జట్టులో డోహర్తి ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా, భారత్‌పై లెఫ్టార్మ్ స్పిన్నర్లు ఎప్పుడూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యం లో తొలి వన్డేకు ముందు అన్ని రంగాల్లో భారత్ ఆధిక్యంలో కనిపిస్తోంది. జట్లు (అంచనా) భారత్: ధోని(కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్, వినయ్ కుమార్. ఆస్ట్రేలియా: బెయిలీ (కెప్టెన్), ఫించ్, హ్యూస్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, హెన్రిక్స్, హాడిన్, మెక్కే, జాన్సన్, ఫాల్క్‌నర్, డోహర్తి. -
ముక్కోణపు సిరీస్‌కు ఒప్పుకోవద్దు
కరాచీ: ఈ ఏడాది చివర్లో శ్రీలంకతో కలిసి ముక్కోణపు సిరీస్ ఆడదామని భారత్ చేస్తున్న ప్రతిపాదనను ఒప్పుకోవద్దని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ ఖాలిద్ మహమూద్ అభిప్రాయపడ్డారు. ప్రతి దానికి బీసీసీఐ వెంట మానుకోవాలన్నారు. వీలైనంత త్వరగా తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడతామని భారత్ హామీ ఇస్తే ముక్కోణపు సిరీస్ ఆడేందుకు ఒప్పుకోవాలని సూచించారు. భారత్‌తో సుదీర్ఘ ఒప్పందాలు పెట్టుకోవడం వల్ల పాక్ క్రికెట్‌కు లాభం చేకూరుతుందన్నారు. ‘భారత్ ప్రతిపాదనను పీసీబీ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దు. ఈ ముక్కోణపు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని స్వదేశంలో లంకతో సిరీస్‌ను రీ షెడ్యూల్ చేసే ప్రయత్నాలు మానుకోవాలి. ఎందుకంటే ముక్కోణపు సిరీస్ ఒక్క భారత్‌కే అనుకూలంగా ఉంటుంది. బీసీసీఐ ఏనాడూ పీసీబీకి మద్దతివ్వలేదు. వాళ్ల ప్రయోజనం కోసమే మన సిరీస్‌ను సవరించేలా ప్రయత్నిస్తున్నారు’ అని మహమూద్ పేర్కొన్నారు. -
సన్‌రైజర్స్‌కు సంగక్కర ఆడట్లేదు
కొలంబో: ఈ ఏడాది చాంపియన్స్ లీగ్‌లో లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆడటం లేదు. తమ దేశవాళీ జట్టు కుందురత తరఫున అతను బరిలోకి దిగుతున్నాడు. లంక ప్రీమియర్ లీగ్ రద్దు కావడంతో సూపర్ 4 లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన కుందురత జట్టు చాంపియన్స్ లీగ్‌కు అర్హత సాధించింది. దీంతో తమ జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తానని సంగక్కర స్పష్టం చేశాడు. లంక బోర్డు కూడా ఇదే విషయాన్ని చెప్పిందన్నాడు. ఐపీఎల్-6లో సన్‌రైజర్స్‌కు ఆడిన ఈ లంక మాజీ కెప్టెన్‌ను చాలా మ్యాచ్‌ల్లో పక్కనబెట్టారు. అయితే విండీస్‌లో జరిగిన ముక్కోణపు సిరీస్‌తో పాటు స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో అతను గాడిలో పడ్డాడు. -
మనోళ్లకు మరో పరీక్ష
ప్రిటోరియా: కొన్నినెలలుగా భారత క్రికెట్ జట్టు అద్వితీయ విజయాలతో దూసుకెళుతోంది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం కరీబియన్ దీవుల్లో ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో ద్వైపాక్షిక సిరీస్... ఇలా వరుస టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ విజయాలతో స్ఫూర్తి పొందిన చతేశ్వర్ పుజారా నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్ము రేపే ఆటతీరును చూపుతోంది. ఇటీవలే ముగిసిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఆసీస్ ‘ఎ’ జట్టును ఓడించి టైటిల్ నెగ్గింది. టోర్నీ ఆరంభంలో తడబడ్డా బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్ తోడవడంతో పైచేయి సాధించింది. ఇక నేటి (శనివారం) నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో రెండు అనధికార టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల తొలి టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రస్టెన్బర్గ్లో జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్లో భారత సీనియర్ జట్టు సఫారీ పర్యటనకు రానుంది. ‘ఎ’ జట్టులో ఉన్న చాలా మంది రాబోయే పర్యటనలో కూడా ఉంటారు. దీంతో వారికి ఇక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం అంచనా వేయడానికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ఇక్కడి నుంచి వారు ఎలాంటి విలువైన సమాచారం తీసుకెళతారనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే సీనియర్ జట్టు వచ్చే సమయానికి వాతావరణ పరిస్థితులు మారతాయి. అప్పటికి మ్యాచ్‌లు వేసవిలో జరుగుతాయి కాబట్టి వికెట్ ఫ్లాట్‌గా మారుతుంది. ఇక ప్రస్తుత జట్టు వన్డేల్లో అదరగొట్టినప్పటికీ టెస్టు ఫార్మాట్ ఆటతీరు విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో తమ సత్తా చూపించి సెలక్టర్లను ఆకర్శించే ప్రయత్నం చేయనున్నారు. ఆత్మవిశ్వాసంతో భారత్ సఫారీ పర్యటనలో ఇప్పటిదాకా భారత ‘ఎ’ జట్టు ఐదు వన్డేలు ఆడితే రెండు మాత్రమే ఓడింది. అదీ ఆసీస్ ‘ఎ’ చేతిలో. అయితే ఫైనల్లో మాత్రం వారిపై తమ ప్రతీకారాన్ని తీర్చుకుంది. బౌలింగ్ విభాగం పెద్దగా ప్రభావం చూపకున్నా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం విశేషంగా రాణిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 248 పరుగులతో డబుల్ సెంచరీ చేసి రికార్డుకెక్కడంతో పాటు ఓవరాల్‌గా 410 పరుగులతో ట్రై సిరీస్‌లో టాప్‌గా నిలిచాడు. కెప్టెన్ పుజారా కూడా ఓ శతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ, రాయుడు, రైనా కూడా జట్టు విజయాల్లో పాలుపంచుకున్నారు. సీనియర్ టెస్టు జట్టులో పుజారా, ధావన్ చోటు ఖాయమే అయినప్పటికీ రోహిత్ ఇప్పటిదాకా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడింది లేదు. 102 వన్డేలు ఆడినా ఇప్పటికీ టెస్టు బెర్త్ దక్కించుకోలేకపోతున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లతో సుదీర్ఘ ఫార్మాట్లోనూ రాణించగలనని సెలక్టర్లను నమ్మించాల్సి ఉంది. మురళీ విజయ్, రైనా జట్టులో ఉంటున్నా భారీ స్కోర్లు మాత్రం సాధించలేకపోతున్నారు. రహానే ఒక్క టెస్టు ఆడాడు. ఇక బౌలింగ్ విభాగంలో పెద్దగా అనుభవం ఉన్న వారు లేకపోవడంతో సహజంగానే రాణించలేకపోతున్నారు. ఉన్నంతలో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయగలిగాడు. స్టువర్ట్ బిన్నీ, ఈశ్వర్ పాండే, షమీ ఐదేసి వికెట్లు పడగొట్టారు. వీరికి ఈ నాలుగు రోజుల మ్యాచ్ అసలైన సవాల్ కానుంది. ఒత్తిడిలో ఆతిథ్య జట్టు స్వదేశీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్నా దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోలేకపోతోంది. ముక్కోణపు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడితే గెలిచింది ఒక్క వన్డేలో మాత్రమే. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆశాభావంతో ఆడాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ హెండ్రిక్స్, ఎల్గర్, డేన్ విలాస్, జార్స్‌వెల్డ్ ఆయా మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఇక బౌలింగ్ పరిస్థితి దయనీయంగా ఉంది. సొంత పిచ్‌లపై తేలిపోతున్నారు. మూడు మ్యాచ్‌ల్లో విల్జోన్ ఆరు వికెట్లు తీసి జట్టు తరఫున టాప్‌గా నిలిచాడు. అన్ని విభాగాల్లో రాణించి భారత ‘ఎ’ జట్టును కట్టడి చేయాలనే ఆలోచనతో టీమ్ మేనేజిమెంట్ ఉంది. జట్లు: భారత్ ‘ఎ’: పుజారా (కెప్టెన్), ధావన్, విజయ్, రోహిత్, రైనా, రాయుడు, కార్తీక్, బిన్నీ, రసూల్, నదీమ్, షమీ, ఉనాద్కట్, పాండే, రహానే, సాహా, కౌల్. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు: ఒంటాంగ్ (కెప్టెన్), ఎల్గర్, హెండ్రిక్స్, అబోట్, బవుమా, గమానే, లెవీ, రోసౌ, వల్లీ, వాండర్ మెర్వ్, జార్స్‌వెల్డ్, విలాస్, విల్జోన్. -
ముక్కోణపు టోర్నీ విజేత భారత్ ‘ఎ’
ప్రిటోరియా: అంతర్జాతీయ వన్డే క్రికెట్లో భారత జట్టు ఆధిపత్యాన్ని ‘ఎ’ జట్టు కూడా కొనసాగించింది. లీగ్ దశలో రెండుసార్లు ఓడించిన జట్టును ఫైనల్లో చిత్తు చేసింది. ఎ జట్ల ముక్కోణపు వన్డే టోర్నీని గెలిచి... భవిష్యత్ కూడా తమదే అని ఘనంగా చాటింది. ఇక్కడి డివిలియర్స్ మైదానంలో బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ 50 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ‘ఎ’ను చిత్తు చేసి ముక్కోణపు సిరీస్ విజేతగా నిలిచింది. భారత్ 49.2 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌట్ కాగా, ఆసీస్ 46.3 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. లీగ్ దశలో రెండు మ్యాచ్‌ల్లోనూ ఆసీస్ చేతిలో ఓడినా...ఫైనల్లో మాత్రం మన జట్టు ఆధిక్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభంలోనే రోహిత్ శర్మ (6) వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే పుజారా (1) కూడా అవుటయ్యాడు. అయితే ఈ దశలో దినేశ్ కార్తీక్ (75 బంతుల్లో 73; 10 ఫోర్లు), శిఖర్ ధావన్ (65 బంతుల్లో 62; 9 ఫోర్లు) కలిసి జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 108 పరుగులు జోడించారు. రైనా (17) విఫలం కాగా, రాయుడు (49 బంతుల్లో 34; 3 ఫోర్లు), సాహా (41 బంతుల్లో 31; 2 ఫోర్లు) కలిసి గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, కౌల్టర్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 53 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కోలుకోలేకపోయింది. నదీమ్‌కు 3, షమీకి 2 వికెట్లు దక్కాయి. స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) హాజల్‌వుడ్ 6; ధావన్ (సి) పైన్ (బి) హెన్రిక్స్ 62; పుజారా (సి) ఫించ్ (బి) మాక్స్వెల్ 1; కార్తీక్ (బి) కౌల్టర్ 73; రైనా (ఎల్బీ) (బి) మిచెల్ మార్ష్ 17; రాయుడు (బి) హాజల్ వుడ్ 34; సాహా (సి) మాక్స్వెల్ (బి) హెన్రిక్స్ 31; రసూల్ (సి) హాజల్‌వుడ్ (బి) కౌల్టర్ 5; పాండే (బి) కౌల్టర్ 1; షమీ (బి) హాజల్‌వుడ్ 3; నదీమ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 3, వైడ్ 6, నోబాల్ 1) 10; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 243. వికెట్ల పతనం: 1-20; 2-34; 3-142; 4-158; 5-166; 6-229; 7-236; 8-238; 9-243; 10-243. బౌలింగ్: హాజల్‌వుడ్ 10-1-31-3; సంధూ 6-0-50-0; మాక్స్వెల్ 5-1-24-1; కౌల్టర్ 9.2-1-35-3; అహ్మద్ 6-0-42-0; హెన్రిక్స్ 10-047-2; మిచెల్ మార్ష్ 3-0-11-1. ఆస్ట్రేలియా ‘ఎ’ ఇన్నింగ్స్: ఫించ్ (బి) షమీ 20; షాన్ మార్ష్ (సి) పుజారా (బి) షమీ 11; మాడిసన్ (సి) రైనా (బి) పాండే 7; మాక్స్వెల్ (సి) పుజారా (బి) రైనా 12; మిచెల్ మార్ష్ రనౌట్ 2; హెన్రిక్స్ (సి) రైనా (బి) నదీమ్ 20; పైన్ (బి) రసూల్ 47; కౌల్టర్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 5; హాజల్‌వుడ్ (స్టంప్డ్) సాహా (బి) నదీమ్ 30; సంధూ (నాటౌట్) 21; అహ్మద్ (రనౌట్) 9; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 6, వైడ్ 3) 9; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 193. వికెట్ల పతనం: 1-30; 2-33; 3-50; 4-52; 5-53; 6-76; 7-88; 8-142; 9-176; 10-193. బౌలింగ్: షమీ 7.3-1-30-2; రైనా 10-1-33-1; పాండే 8-1-47-1; నదీమ్ 10-1-34-3; ధావన్ 1-0-13-0; రసూల్ 10-1-30-1. -
కొత్త ఉత్సాహంతో భారత్ ‘ఎ’
ప్రిటోరియా: దక్షిణాఫ్రికాపై ధమాకా బ్యాటింగ్ ప్రదర్శించిన భారత ‘ఎ’ జట్టు ముక్కోణపు సిరీస్‌లో తుది పోరాటానికి సిద్ధమైంది. ఇక్కడి డివిలియర్స్ స్టేడియంలో బుధవారం జరిగే ఫైనల్లో పుజారా సేన, ఆస్ట్రేలియా ‘ఎ’ను ఎదుర్కొంటుంది. గత మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఇండియా టీమ్‌లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. మరో వైపు లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లూ గెలిచిన ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసి రికార్డులు నెలకొల్పిన శిఖర్ ధావన్పైనే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో రెండు మ్యాచుల్లోనూ భారత్ ఓడింది. ఆ రెండూ చాలా గొప్ప ఇన్నింగ్స్: ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్లో తాను డబుల్ సెంచరీ సాధించినా...సచిన్, సెహ్వాగ్‌ల ఇన్నింగ్స్‌తో పోలిస్తే తనది పెద్ద ఘనత కాదని భారత ‘ఎ’ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ‘సచిన్, సెహ్వాగ్ చేసిన డబుల్ సెంచరీల గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆ రెండూ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్. పైగా అవి అంతర్జాతీయ స్థాయిలో చేసినవి. నా ఇన్నింగ్స్‌కంటే వాటి ఘనత ఎంతో ఎక్కువ’ అని అతను అభిప్రాయ పడ్డాడు. -
భారత్ ‘ఎ’కు తొలి గెలుపు
ప్రిటోరియా: ముక్కోణపు సిరీస్‌లో భారత్-ఎ జట్టు బోణి చేసింది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో 18 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ ప్రకారం)తో దక్షిణాఫ్రికా-ఎ పై విజయం సాధించింది. దీంతో భారత్‌కు 4 పాయింట్లు లభించాయి. ఎల్సీ డివిలియర్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లు కుదించారు. ప్రొటీస్ జట్టు టాస్ గెలవగా... మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లకు 309 పరుగుల భారీ స్కోరు చేసింది. టాప్ ఆర్డర్లో ధావన్ (67 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ (65 బంతుల్లో 65; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రైనా (34 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), రాయుడు (38 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగుల వరద పారించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 34.4 ఓవర్లలో 5 వికెట్లకు 258 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం రావడంతో మ్యాచ్ నిలిచిపోయింది. డక్‌వర్త్ ప్రకారం ప్రొటీస్ జట్టు గెలవాలంటే అప్పటికి 277 పరుగులు చేయాల్సి ఉంది. ఎల్గర్ (72 బంతుల్లో 84; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జార్స్వీల్డ్ (61 బంతుల్లో 69; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), రోసోవ్ (33 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (31 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించారు. రసూల్, నదీమ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఉనాద్కట్ ఒక్క వికెట్ పడగొట్టాడు. -
పోరాడి ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఎ జట్టు పోరాడి ఓడింది. మ్యాక్స్‌వెల్ (79 బంతుల్లో 145 నాటౌట్, 18 ఫోర్లు, 6 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా 7 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరు చేసింది. నిక్ మెడిన్సన్ (56 బంతుల్లో 52, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధసెంచరీ చేశాడు. భారత బౌలర్లు షమీ, నదీమ్, శిఖర్ ధావన్ తలా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ 36.2 ఓవర్లలో 152 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బౌండరీలు, భారీ సిక్సర్లతో ఆసీస్ స్కోరును అమాంతం పెంచేశాడు. దీంతో చివరి 13.4 ఓవర్లలో ఆస్ట్రేలియా-ఎ జట్టు 146 పరుగులు చేసింది. తర్వాత భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ 8 వికెట్లకు 291 పరుగులు చేయగలిగింది. ఏపీ క్రికెటర్ రాయుడు (56 బంతుల్లో 70, 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రైనా (79 బంతుల్లో 83, 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (87 బంతుల్లో 66, 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించినప్పటికీ భారత్‌కు విజయాన్ని అందించలేకపోయారు. విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో 49వ ఓవర్ వేసిన నైల్... రాయుడుతో పాటు, స్టువర్ట్ బిన్నీ (0)ని ఔట్ చేయడమే కాకుండా మెయిడిన్ ఓవర్ వేశాడు. దీంతో భారత్‌కు పరాజయం తప్పలేదు.