మనోళ్లకు మరో పరీక్ష | India A take title with resounding win | Sakshi
Sakshi News home page

మనోళ్లకు మరో పరీక్ష

Published Sat, Aug 17 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM

మనోళ్లకు మరో పరీక్ష

మనోళ్లకు మరో పరీక్ష

ప్రిటోరియా: కొన్నినెలలుగా భారత క్రికెట్ జట్టు అద్వితీయ విజయాలతో దూసుకెళుతోంది. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం కరీబియన్ దీవుల్లో ముక్కోణపు సిరీస్, జింబాబ్వేతో ద్వైపాక్షిక సిరీస్... ఇలా వరుస టైటిల్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ విజయాలతో స్ఫూర్తి పొందిన చతేశ్వర్ పుజారా నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనలో దుమ్ము రేపే ఆటతీరును చూపుతోంది.
 
 ఇటీవలే ముగిసిన ముక్కోణపు టోర్నీ ఫైనల్లో ఆసీస్ ‘ఎ’ జట్టును ఓడించి టైటిల్ నెగ్గింది. టోర్నీ ఆరంభంలో తడబడ్డా బ్యాట్స్‌మెన్ సూపర్ ఫామ్ తోడవడంతో పైచేయి సాధించింది. ఇక నేటి (శనివారం) నుంచి దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో రెండు అనధికార టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల తొలి టెస్టు మ్యాచ్ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రస్టెన్‌బర్గ్‌లో జరుగుతుంది. ఈ ఏడాది డిసెంబర్‌లో భారత సీనియర్ జట్టు సఫారీ పర్యటనకు రానుంది.
 
 ‘ఎ’ జట్టులో ఉన్న చాలా మంది రాబోయే పర్యటనలో కూడా ఉంటారు. దీంతో వారికి ఇక్కడి వాతావరణ పరిస్థితులు, పిచ్ స్వభావం అంచనా వేయడానికి ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే ఇక్కడి నుంచి వారు ఎలాంటి విలువైన సమాచారం తీసుకెళతారనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే సీనియర్ జట్టు వచ్చే సమయానికి వాతావరణ పరిస్థితులు మారతాయి. అప్పటికి మ్యాచ్‌లు వేసవిలో జరుగుతాయి కాబట్టి వికెట్ ఫ్లాట్‌గా మారుతుంది. ఇక ప్రస్తుత జట్టు వన్డేల్లో  అదరగొట్టినప్పటికీ టెస్టు ఫార్మాట్ ఆటతీరు విభిన్నంగా ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్‌లో తమ సత్తా చూపించి సెలక్టర్లను ఆకర్శించే ప్రయత్నం చేయనున్నారు.
 
 ఆత్మవిశ్వాసంతో భారత్
 సఫారీ పర్యటనలో ఇప్పటిదాకా భారత ‘ఎ’ జట్టు ఐదు వన్డేలు ఆడితే రెండు మాత్రమే ఓడింది. అదీ ఆసీస్ ‘ఎ’ చేతిలో. అయితే ఫైనల్లో మాత్రం వారిపై తమ ప్రతీకారాన్ని తీర్చుకుంది. బౌలింగ్ విభాగం పెద్దగా ప్రభావం చూపకున్నా బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం విశేషంగా రాణిస్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. 248 పరుగులతో డబుల్ సెంచరీ చేసి రికార్డుకెక్కడంతో పాటు ఓవరాల్‌గా 410 పరుగులతో ట్రై సిరీస్‌లో టాప్‌గా నిలిచాడు. కెప్టెన్ పుజారా కూడా ఓ శతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ, రాయుడు, రైనా కూడా జట్టు విజయాల్లో పాలుపంచుకున్నారు. సీనియర్ టెస్టు జట్టులో పుజారా, ధావన్ చోటు ఖాయమే అయినప్పటికీ రోహిత్ ఇప్పటిదాకా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడింది లేదు. 102 వన్డేలు ఆడినా ఇప్పటికీ టెస్టు బెర్త్ దక్కించుకోలేకపోతున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లతో సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రాణించగలనని సెలక్టర్లను నమ్మించాల్సి ఉంది. మురళీ విజయ్, రైనా జట్టులో ఉంటున్నా భారీ స్కోర్లు మాత్రం సాధించలేకపోతున్నారు. రహానే ఒక్క టెస్టు ఆడాడు. ఇక బౌలింగ్ విభాగంలో పెద్దగా అనుభవం ఉన్న వారు లేకపోవడంతో సహజంగానే రాణించలేకపోతున్నారు. ఉన్నంతలో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఐదు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీయగలిగాడు. స్టువర్ట్ బిన్నీ, ఈశ్వర్ పాండే, షమీ ఐదేసి వికెట్లు పడగొట్టారు. వీరికి ఈ నాలుగు రోజుల మ్యాచ్ అసలైన సవాల్ కానుంది.
 
 ఒత్తిడిలో ఆతిథ్య జట్టు
 స్వదేశీ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్నా దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు పరిస్థితులను అనుకూలంగా మార్చుకోలేకపోతోంది. ముక్కోణపు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడితే గెలిచింది ఒక్క వన్డేలో మాత్రమే. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల మ్యాచ్‌ను ఆశాభావంతో ఆడాల్సి ఉంది. బ్యాటింగ్‌లో ఓపెనర్ హెండ్రిక్స్, ఎల్గర్, డేన్ విలాస్, జార్స్‌వెల్డ్ ఆయా మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నారు. ఇక బౌలింగ్ పరిస్థితి దయనీయంగా ఉంది. సొంత పిచ్‌లపై తేలిపోతున్నారు. మూడు మ్యాచ్‌ల్లో విల్జోన్ ఆరు వికెట్లు తీసి జట్టు తరఫున టాప్‌గా నిలిచాడు. అన్ని విభాగాల్లో రాణించి భారత ‘ఎ’ జట్టును కట్టడి చేయాలనే ఆలోచనతో టీమ్ మేనేజిమెంట్ ఉంది.
 
 జట్లు: భారత్ ‘ఎ’: పుజారా (కెప్టెన్), ధావన్, విజయ్, రోహిత్, రైనా, రాయుడు, కార్తీక్, బిన్నీ, రసూల్, నదీమ్, షమీ, ఉనాద్కట్, పాండే, రహానే, సాహా, కౌల్. దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు: ఒంటాంగ్ (కెప్టెన్), ఎల్గర్, హెండ్రిక్స్, అబోట్, బవుమా, గమానే, లెవీ, రోసౌ, వల్లీ, వాండర్ మెర్వ్, జార్స్‌వెల్డ్, విలాస్, విల్జోన్.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement