ప్రిటోరియా: దక్షిణాఫ్రికాపై ధమాకా బ్యాటింగ్ ప్రదర్శించిన భారత ‘ఎ’ జట్టు ముక్కోణపు సిరీస్‌లో తుది పోరాటానికి సిద్ధమైంది. ఇక్కడి డివిలియర్స్ స్టేడియంలో బుధవారం జరిగే ఫైనల్లో పుజారా సేన, ఆస్ట్రేలియా ‘ఎ’ను ఎదుర్కొంటుంది. గత మ్యాచ్‌లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చిన ఇండియా టీమ్‌లో కొత్త ఉత్సాహం కనబడుతోంది. మరో వైపు లీగ్ దశలో నాలుగు మ్యాచ్‌లూ గెలిచిన ఆస్ట్రేలియా తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తోంది. దక్షిణాఫ్రికాపై డబుల్ సెంచరీ చేసి రికార్డులు నెలకొల్పిన శిఖర్ ధావన్‌పైనే ఇప్పుడు అందరి దృష్టీ నిలిచింది. లీగ్ దశలో ఆసీస్ చేతిలో రెండు మ్యాచుల్లోనూ భారత్ ఓడింది.
ఆ రెండూ చాలా గొప్ప ఇన్నింగ్స్: ధావన్
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తాను డబుల్ సెంచరీ సాధించినా...సచిన్, సెహ్వాగ్‌ల ఇన్నింగ్స్‌తో పోలిస్తే తనది పెద్ద ఘనత కాదని భారత ‘ఎ’ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. ‘సచిన్, సెహ్వాగ్ చేసిన డబుల్ సెంచరీల గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆ రెండూ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఇన్నింగ్స్. పైగా అవి అంతర్జాతీయ స్థాయిలో చేసినవి. నా ఇన్నింగ్స్‌కంటే వాటి ఘనత ఎంతో ఎక్కువ’ అని అతను అభిప్రాయ పడ్డాడు.
కొత్త ఉత్సాహంతో భారత్ ‘ఎ’
Published Wed, Aug 14 2013 2:26 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement