మెక్కే ‘హ్యాట్రిక్’ వృథా
కార్డిఫ్: ఆరంభంలో ఆస్ట్రేలియా పేసర్ క్లింట్ మెక్కే (4/39)) హ్యాట్రిక్ నమోదు చేసినా... బ్యాట్స్‌మెన్ పోరాట స్ఫూర్తితో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. బట్లర్ (65 నాటౌట్), కార్బెర్రీ (63), మోర్గాన్ (53)లు అర్ధసెంచరీలతో చెలరేగడంతో ఆతిథ్య జట్టు 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
సోఫియా గార్డెన్స్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ 48.2 ఓవర్లలో 227 పరుగులకు ఆలౌటైంది. బెయిలీ (87)కి తోడు వేడ్ (36), వోజెస్ (30) రాణించారు. ట్రెడ్‌వెల్ మూడు వికెట్లు తీశాడు. తర్వాత ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసి గెలిచింది. మూడో ఓవర్ తొలి మూడు బంతులకు పీటర్సన్ (5), ట్రాట్ (0), రూట్ (0)లను మెక్కే అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అయితే కార్బెర్రీ, మోర్గాన్‌లు నాలుగో వికెట్‌కు 104 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను ఆదుకున్నారు. తర్వాత స్టోక్స్ (25), బట్లర్ సమయోచితంగా ఆడుతూ ఏడో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్ జట్టు విజయం దిశగా పయనించింది. చివరి ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సిన దశలో బట్లర్... జాన్సన్ బౌలింగ్‌లో ఓ సిక్సర్, ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే సౌతాంప్టన్‌లో సోమవారం జరుగుతుంది.