Australia Scientists
-
కంటినిండా నిద్రకు కుంకుమ పువ్వు
ఎంత ప్రయత్నించినా రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా? తెల్లవార్లూ మంచంపై పొర్లుదండాలు పెడుతున్నారా? కంటినిండా నిద్రపోవాలంటే ఏం చేయాలో చెప్పండర్రా అని అందరినీ అడుగుతున్నారా? చాలా సింపుల్. కాసింత కుంకుమపువ్వు తీసుకుంటే సరిపోతుందంటున్నారు ఆస్ట్రేలియాలోని మర్డాక్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థం ఒకటి నిద్రకు బాగా ఉపకరిస్తుందని వీరు ప్రయోగపూర్వకంగా గుర్తించారు. పద్దెనిమిది ఏళ్ల నుంచి 70 ఏళ్ల మధ్యవయస్కులు కొందరిని ఎంపిక చేసి వారిలో కొందరికి రోజూ 14 మిల్లీగ్రాముల కుంకుమపువ్వు నుంచి తీసిన పదార్థాన్ని ఇచ్చారు. మిగలిన వారికి ఉత్తుత్తి మాత్రలు ఇచ్చారు. వీరందరికీ నిద్రలేమి సమస్యలు ఉన్నాయని, ముందుగానే తెలుసు. అంతేకాకుండా వీరు ఏ రకమైన మందులు తీసుకోవడం లేదు. నాలుగు వారాల పాటు జరిగిన పరీక్ష తరువాత పరిశీలించినప్పుడు కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడుతున్న వారికి మెరుగైన నిద్ర పడుతున్నట్లు తెలిసింది. ఏడు రోజుల తరువాతి నుంచే తమ నిద్ర నాణ్యతలో మెరుగుదల కనిపించిందని ప్రయోగంలో పాల్గొన్న వారు చెప్పారు. పైగా కుంకుమ పువ్వు నుంచి తీసిన పదార్థాన్ని వాడటం ద్వారా ఎలాంటి దుష్ప్రభావమూ కనిపించలేదు కూడా. ఇప్పుడు మరింత విస్తత స్థాయిలో మరోసారి ప్రయోగాలు నిర్వహించి ఫలితాలను నిర్ధారించుకుంటామని అడ్రియన్ లోప్రెసెటీ అనే శాస్త్రవేత్త తెలిపారు. -
ఒక్క ఇంజెక్షన్‌తో రక్త కేన్సర్‌కు చికిత్స?
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. కేవలం ఒకే ఒక్క ఇంజెక్షన్‌తో రక్త కేన్సర్‌కు పూర్తిస్థాయి చికిత్స అందించేందుకు డాక్టర్ కెన్ మైక్లెథ్‌వెయిట్ రంగం సిద్ధం చేస్తున్నారు. కార్–టీ అని పిలిచే ఒక రకమైన రోగ నిరోధక కణాలను ఆధునీకరించి శరీరంలోకి ఇంజెక్షన్ రూపంలో ఎక్కించడం ద్వారా 70 – 80 శాతం కేన్సర్ కణాలను నాశనం చేయవచ్చునని డాక్టర్ కెన్ అంటన్నారు. కేన్సర్ కణాలు శరీర రోగ నిరోధక వ్యవస్థ కళ్లుగప్పి విస్తరిస్తుందని మనకు తెలుసు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్–టీ రోగనిరోధక కణాల్లో కొన్నిమార్పులు చేస్తారు. ఫలితంగా ఈ కణాలు కేన్సర్ కణాలను గుర్తిండచమే కాకుండా నాశనం కూడా చేయగలవు. నిజానికి ఈ రకమైన చికిత్స అమెరికాలో ఇప్పటికే అందుబాటులో ఉంది. కాకపోతే ఖర్చు కోట్లల్లోనే. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త కెన్ కొత్త పద్ధతి ద్వారా కార్ –టీ కణాలను ఉపయోగించారు. రక్త కేన్సర్‌తోపాటు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఉన్న టాడ్ ఓ షియా అనే 19 ఏళ్ల యువకుడిపై జరిపిన ప్రయోగంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాత కెన్ తన చికిత్స ప్రారంభించారు. రోగి శరీరం నుంచి సేకరించిన కార్ –టీ కణాలను పరిశోధన శాలలో మార్పులు చేసి.. కేన్సర్ కణాలను గుర్తించేలా చేశారు. కేవలం రూ.ఏడు లక్షల ఖర్చుతో చేసిన ఓ ఇంజెక్షన్ నెలరోజుల్లోనే ఫలితాలు చూపడం మొదలైంది. ప్రస్తుతానికి ఇది రక్త సంబంధిత కేన్సర్లకు మాత్రమే చికిత్స అందిస్తున్నప్పటికీ భవిష్యత్తులో ఇతర కేన్సర్లకు విస్తరించే అవకాశం లేకపోలేదని అంటున్నారు డాక్టర్ కెన్. -
నాసా అంతరిక్ష గోధుమ పంట స్ఫూర్తితో..
మెల్బోర్న్: అంతరిక్షంలో గోధుమలు పండించేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ చేపట్టిన ప్రయత్నాన్ని ఆదర్శంగా తీసుకుని ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు నూతన పద్ధతిని అభివృద్ధి చేశారు. ‘స్పీడ్ బ్రీడింగ్’ అనే ఈ పద్ధతి ద్వారా భూమిపై పంట దిగుబడిని సాధారణం కంటే మూడు రెట్లు పెంచడంతోపాటు పంట కోతకు వచ్చే సమయాన్ని కూడా 6 రెట్లు తగ్గించవచ్చని ప్రయోగ పూర్వకంగా నిరూపించారు. నాసా అంతరిక్షంలో గోధుమ పంట త్వరగా కోతకు వచ్చేందుకు పంటపై లైట్ ద్వారా నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేసింది. దీంతో పంట సాధారణం కంటే ముందుగానే కోతకు రావడంతోపాటు మరో పంటను వేసేందుకు వీలు కలుగుతుంది. ఈ పద్ధతిని స్ఫూర్తిగా తీసుకుని భూమిపై ప్రత్యేకంగా రూపొందించిన గ్లాస్ హౌస్‌ల్లో గోధుమ, బార్లీ, ఆవాలు, శెనగ వంటి పంటలపై నిరంతరాయంగా వెలుగును ప్రసరింపజేశామని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్సిటీకి చెందిన సీనియర్ రీసెర్చ్ ఫెలో లీ హిక్కీ తెలిపారు. చాలా ఆశ్చర్యకరంగా ఈ పద్ధతిలో ఏడాదిలో ఆరు సార్లు గోధుమ, శెనగ, బార్లీ, నాలుగు సార్లు ఆవాల పంటలను ఉత్పత్తి చేశామని లీ అన్నారు. ఇదే సాధారణ గ్లాస్ హౌస్‌ల్లో అయితే రెండు సార్లు, పొలాల్లో అయితే ఏడాదికి ఒకసారి మాత్రమే పంట ఉత్పత్తి జరిగేదని వెల్లడించారు. -
విటమిన్–బీతో గర్భస్రావాలకు చెక్?
సిడ్నీ: పనిఒత్తిడి, కాలుష్యం వంటి కారణాలతో ఆకస్మిక గర్భస్రావాలు జరుగుతుంటాయి. అయితే గర్భస్రావాలే కాకుండా పుట్టే పిల్లల్లో వచ్చే అనేక లోపాలను అధిగమించేందుకు తగినంత విటమిన్ –బీ3 ఎంతో ఉపయోగపడుతుందని ఆస్ట్రేలియాలోని విక్టక్ చాంగ్ కార్డియాక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నికొటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ (ఎన్ఏడీ) అనే మూలకం పిండం అభివృద్ధికి, డీఎన్ఏ మరమ్మతులు, కణాల మధ్య సమాచారం అందించేందుకు ఎంతో కీలకమని వీరు ఓ అధ్యయనం ద్వారా గుర్తించారు. ఈ మూలకం తగినంత లేకపోవడం వల్ల గర్భస్రావాలు జరిగే అవకాశాలు పెరుగుతాయని, పుట్టబోయే బిడ్డ గుండె, వెన్నెముక, మూత్రపిండాల్లో లోపాలు తలెత్తవచ్చని తెలిసింది. కూరగాయల్లో ఎక్కువగా ఉండే నియాసిన్ ద్వారా ఎన్ఏడీ మూలకం శరీరానికి అందుతుందని, గర్భధారణ సమయంలో తీసుకునే మల్టీ విటమిన్ మాత్రల ద్వారా కూడా విటమిన్–బీ3 మోతాదు బాగా పెరుగుతున్నట్లు తాము గుర్తించామని శాస్త్రవేత్త సాలీ డున్వుడీ తెలిపారు. ఎలుకల్లో జరిపిన ప్రయోగాల్లో విటమిన్–బీ3 మోతాదు తక్కువగా ఉన్నప్పుడు గర్భస్రావాలు ఎక్కువైనట్లు గుర్తించామని, విటమిన్‌ను అందించినప్పుడు గర్భస్రావాలు గణనీయంగా తగ్గాయని సాలీ చెప్పారు. ఈ నేపథ్యంలో శరీరంలోని ఎన్ఏడీ మోతాదులను గుర్తించేందుకు, తద్వారా విటమిన్–బీ3 వాడకాన్ని నిర్ధారించేందుకు ఓ పరీక్షను సిద్ధం చేస్తున్నామని, ఇది అందుబాటులోకి వస్తే గర్భస్రావాల సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.