డైవర్‌కు చుక్కలు చూపిన షార్క్..
ఓ ఆస్ట్రేలియన్ డైవర్‌కు ఓ భారీ రాకాసి షార్క్ చుక్కలు చూపించింది. వేటాడి వేటాడి తీవ్రంగా గాయపరిచింది. ఏదోలా చావు నుంచి బయటపడిన అతడు మాత్రం దాదాపు ఎనిమిది గంటల పాటు చావు కంటే నరకాన్ని అనుభవించాడు. ఆ తర్వాతే అతడికి వైద్యం అందింది. క్వీన్స్లాండ్ తీరంలోని ఏజెన్సీ ప్రాంతంగా ఉండే గ్రేట్ బారియర్ రీఫ్లో స్కూబాకు చెందిన డైవర్ ఓ మరబోటులో వెళ్లి సముద్రంలోకి దిగాడు. అనంతరం ప్రశాంతంగా నీటి అడుగుభాగంలోకి వెళ్లి ఈదుతున్నాడు.
దాదాపు 50 అడుగుల లోతుగా వెళ్లి ముందుకు వెళుతున్న సమయంలో అనూహ్యంగా వెనుక నుంచి అతడిపై షార్క్ దాడి చేసింది. అతడి చేతిని పలుమార్లు గట్టిగా కొరికింది. అలాగే కడుపులో కూడా గాయం చేసింది. దాదాపు 8 చోట్ల గాయాలపాలయినప్పటికీ ఎంతో ధైర్యంగా ఈది తన మరబోటును చేరుకున్న అతడు బతుకు జీవుడా అంటూ ప్రాణాలు దక్కించుకున్నాడు. రక్తస్రావం తీవ్రంగా అవ్వడంతో దాదాపు 8 గంటలపాటు నొప్పులు అనుభవించాడు. కానీ ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకోగలిగాడు.