వాతావరణం ఉద్విగ్నభరితం
సిడ్నీ టెస్టుకు ఆసీస్ ఆటగాళ్లు సిద్ధం
సిడ్నీ: అది తమ సహచరుడు కుప్పకూలిన చోటు... ఆ ఘటన జరిగిన తర్వాత వాళ్లెవరూ ఆ మైదానం ఛాయలకు కూడా పోలేదు. కానీ ఇప్పుడు నేరుగా టెస్టు మ్యాచ్ బరిలోకి దిగాల్సిన స్థితి. ఇప్పుడు ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా గంభీర వాతావరణం నెలకొంది. ఫిల్ హ్యూస్ మరణానంతరం వారు ఇప్పుడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఆడబోతున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మిషెల్ జాన్సన్, ‘ఫిల్ మరణం తర్వాత మాలో చాలా మంది ఇప్పుడే ఇక్కడికి వస్తున్నారు.
గ్రౌండ్లో ఆడబోయే సమయంలో మా పరిస్థితి ఎలా ఉండబోతోందో చెప్పలేను. ముఖ్యంగా నాటి ఘటన చూసిన నలుగురు మరింతగా బాధ పడటం ఖాయం. అయితే కొద్ది రోజులుగా మా జట్టు దీనిని ఓర్చుకుంది. అదే తరహాలో బాగా ఆడి గెలుస్తాం’ అని అన్నాడు. మరో వైపు బిగ్‌బాష్ మ్యాచ్ కోసం ఇటీవలే ఈ మైదానంలో ఆడిన సిడిల్, కొద్ది సేపు ఆ బాధ వెంటాడుతుందని, హ్యూస్ కోసం ఈ మ్యాచ్‌లో బాగా ఆడతామని చెప్పాడు.