ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ అరుదైన ఘనత
మెల్బోర్న్: ప్రవాస తెలుగుమహిళ సంధ్యారెడ్డి ఆస్ట్రేలియాలో అరుదైన ఘనత వహించారు. హైదరాబాద్కు చెందిన కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతులు దశాబ్దం కిందటే ఆస్ట్రేలియాకు వలస వెళ్లి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఎన్నికల బరిలో నిలిచిన సంధ్యారెడ్డి.. ఆస్ట్రేలియాలో స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న తొలి ప్రవాస తెలంగాణవాసిగా ఆమె రికార్డు సృష్టించారు. ఈ విషయాలను ఆమె భర్త బుచ్చిరెడ్డి తెలిపారు.
తన భార్య సంధ్యారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడంపై బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సిడ్నీ సబర్బన్ ఏరియా స్టార్త్ ఫీల్డ్ మునిసిపాలిటీ ఎన్నికల బరిలో సంధ్యారెడ్డి ఉన్నట్లు తెలిపారు. ఆసీస్ లోని ప్రవాస భారతీయులు సంధ్యారెడ్డికి తమ మద్ధతు తెలపడంతో ఆమె విజయంపై బుచ్చిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఆ చిచ్చర పిడుగు వీరి కుమారుడే!
మరోవైపు ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో నిర్వహించిన ఆస్ట్రేలియా జూనియర్ చెస్ చాంపియన్ షిప్-2017 (ఏజేసీసీ)ను భారత సంతతికి చెందిన నిఖిల్ రెడ్డి అనే ఎనిమిదేళ్ల బాలుడు సాధించిన విషయం తెలిసిందే. నిఖిల్ రెడ్డి మరెవరో కాదు.. కర్రి బుచ్చిరెడ్డి, సంధ్యారెడ్డి దంపతుల కుమారుడు కావడం గమనార్హం.