Australian photographer
-
సహజీవనం ఎంత మధురం!
‘‘ఆత్మస్థయిర్యం, మనో నిబ్బరం, దృఢ సంకల్పం, జీవితంపై పూర్తి అవగాహన.. ఇవన్నీ మనిషిని పరిపూర్ణుణ్ణి చేస్తాయి. ఇవన్నీ నాకూ ఉన్నాయి. తల్లితండ్రులపై ఆధారపడకుండా చిన్న వయసులోనే సొంతంగా బతకడం మొదలుపెట్టాను. అందుకే, త్వరగా అవన్నీ నాకు లభించాయి. అయితే... ఒక్కటి మాత్రం నిజం. మా అమ్మ లేకపోతే కచ్చితంగా ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు’’ అన్నారు ఇలియానా. ఇటీవల ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా మీడియాతో ముచ్చటించారు. ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమాయణం గురించి అడిగితే మాత్రం చిరునవ్వే ఆమె సమాధానమైంది. పెళ్లి గురించి మీ అభిప్రాయం? అనడిగితే -‘‘నిబద్ధత, నమ్మకం, ప్రేమ.. వీటితో కూడుకున్నదే పెళ్లి. ఈ ప్రక్రియపై నాకు గౌరవం, నమ్మకం రెండూ ఉన్నాయి. కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. అయితే దానికి టైముంది. నా దృష్టిలో సహజీవనం ఎంత మధురంగా ఉంటుందో, వైవాహిక జీవితం కూడా అంతే మధురంగా ఉంటుంది’’ అని బదులిచ్చారు. -
ప్రేమికుడితో కెమేరా ముందుకు ఇలియానా
ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో నటి ఇలియానా ప్రేమలో పడ్డారంటూ వార్త వచ్చిన విషయం తెలిసిందే. ఇలియానా నటిస్తున్న చిత్రాల షూటింగ్ లొకేషన్స్‌లో ఆండ్రూ కనిపించడం ఈ వార్తకు ఊతమిచ్చింది. ముఖ్యంగా ప్రస్తుతం ఇలియానా నటిస్తున్న హిందీ చిత్రాల్లో ఒకటైన ‘హ్యాపీ ఎండింగ్’ చిత్రం లొకేషన్‌కు ఆండ్రూ తరచుగా వెళుతున్నారట. లాస్ ఏంజిల్స్‌లో ఈ చిత్రం షూటింగ్ జరిగినప్పుడు ఆండ్రూ దర్శనమివ్వని రోజు లేదని సమాచారం. అంతే కాదు... ఈ చిత్రంలో ఆయన ఓ అతిథి పాత్ర కూడా చేశారట. చిత్రదర్శకులు డీకే కృష్ణ, రాజ్ నిడుమోరు అడగ్గానే ఆండ్రూ కాదనకుండా ఈ పాత్ర చేశారనీ, తన ప్రేయసి (?) ఇలియానాతో కలిసి ఆయన ఒకే ఒక్క సన్నివేశంలో కనిపిస్తారనీ భోగట్టా. కెమెరా పట్టుకుని ఫొటోలు తీయడం తప్ప కెమెరా ముందు నటించడం తెలియని ఆండ్రూకు ఇలియానా స్వయంగా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారట. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.