గోదావరి ఒడిలో పుట్టడం నా అదృష్టం!
- రచయిత భాస్కరభట్ల
‘‘తల్లి గోదావరిని చూడటానికి రాజమండ్రి వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఎక్కి అందులో
ప్రయాణిస్తూ మా ఊరు చేరుతుంటే నన్నెవరో అనాథ శరణాలయం నుంచి
అమ్మ పొత్తిళ్లలోకి చేరవేస్తున్నట్లనిపించింది.
డబ్బా పాలను విసిరేసి అమ్మ స్తన్యాన్ని
గ్రోలడానికి ఆవురావురుమని వచ్చే పసిపిల్లాణ్ణి అయిపోతా’’
ఈ ‘తల్లి గోదావరి’ కవిత మొదట తనికెళ్ల భరణి గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనంలో చెప్పాను. సంగీత దర్శకుడు చక్రి కన్నీళ్లతో నన్ను కౌగిలించుకున్నారు. అప్పటి నుంచి నా జీవితం మలుపు తిరిగింది. ఆ గోదావరితో నాకున్న అనుభవాలు, అనుభూతులు అనేకం. నేను గోదావరి తీరంలో పుట్టి ఉండకపోతే, నేనసలు ఇంత పెద్ద రచయితని అయ్యేవాడిని కాదేమో. ఈ కవిత చెప్పాక చక్రి నన్ను పూరి జగన్నాథ్‌కు పరిచయం చేశారు. ఇక అప్పటి నుంచి నా జీవితమే మారిపోయింది. ఇక వరుసగా ‘ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న
ఓ తమిళ అమ్మాయి... ఇలా నా కెరీర్లో వరుస హిట్లు. ఆ పాట అప్పుడే రాశాను. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ స్థాయిలో ఉండటానికి ఆ గోదావరే కారణం. ఆ గోదారమ్మ ఒడిలో పుట్టడం నా అదృష్టం. ‘కబడ్డీ కబడ్డీ’ సినిమా సిట్టింగ్స్ గోదావరి మీద లాంచీలో జరిగాయి. అప్పటికప్పుడు ‘గోరువంక గోదారి వంక ఈత కెళదాం వస్తావా’ అనే పాట రాశాను. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఒక్కడినైనా సరే అక్కడికి వెళ్ళిపోయి, అక్కడ చక్కగా ఏదో ఒకటి కొనుక్కుని, హాయిగా పుష్కరాల రేవులో కాలక్షేపం చేయడం చాలా ఆనందంగా ఉంటుంది.
నాకు ఊహ తెలిశాక మొదటి పుష్కర సమయంలో పాకెట్ మనీ కోసం కంట్రిబ్యూటర్‌గా జాయిన్ అయ్యాను. రెండో పుష్కరాల టైమ్‌కి నేను సినీ పరిశ్రమలో రైటర్ని అయ్యాను. ఈ మూడో పుష్కరానికి సెలబ్రిటీ హోదాలో ఉన్నాను. అలా ఆ గోదావరి ఒడ్డున నడచుకుంటూ వెళుతూ ఉంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆ గోదావరి తీరంలోనే నేను అక్షరాభ్యాసం చేశాను. అక్కడ గౌత మీ లైబ్రరీలో చదువుకున్న పుస్తకాలు నేను రచయిత కావడానికి పునాదులయ్యాయి.
- శశాంక్ బి.