మేమూ అవార్డులు వెనక్కి ఇచ్చేస్తాం
♦ సాహిత్య అవార్డును వెనక్కిచ్చేస్తా: మలయాళ రచయిత్రి సారా
♦ ఉర్దూ సాహిత్య అవార్డును వాపసు చేస్తా: రెహ్మాన్ అబ్బాస్
♦ సాహిత్య అకాడమీ కమిటీల నుంచి తప్పుకున్న కె. సచ్చిదానందన్
తిరువనంతపురం/న్యూఢిల్లీ: దాద్రీ ఘటన, హేతువాదుల హత్యలపై మరికొందరు రచయితలు నిరసన గళం వినిపించారు. వీటికి, దేశంలో పెరుగుతున్న అసహన సంస్కృతికి నిరసనగా తనకు కేంద్ర సాహిత్య అకాడమీ ఇచ్చిన అవార్డును తిరిగి ఇచ్చేస్తానని ప్రముఖ మలయాళ రచయిత్రి సారా జోసఫ్ శనివారం ప్రకటించారు. మహారాష్ట్ర ఉర్దూ సాహిత్య అకాడమీ పురస్కరాన్ని తానూ వాపసు చేస్తానని ఉర్దూ నవలా రచయిత రెహ్మాన్ అబ్బాస్ ప్రకటించారు. మరోపక్క.. కన్నడ హేతువాది కల్బుర్గికి హత్యకు నిరసనగా ప్రముఖ మలయాళ కవి కె. సచ్చిదానందన్ సాహిత్య అకాడమీ కమిటీల్లోని తన పదవులన్నింటికి రాజీనామా చేశారు. అకాడమీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని మలయాళ కథా రచయిత పీకే పరక్కడవు కూడా ప్రకటించారు.
మతసామరస్యానికి పెను ముప్పు: సారా
కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో ప్రమాదకర పరిస్థితులు తలెత్తాయని సారా జోసఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. మతసామరస్యానికి, లౌకిక వాదానికి ఇదివరకెన్నడూ లేనంత ముప్పు ఏర్పడిందని త్రిస్సూర్ నుంచి పీటీఐతో చెప్పారు. అవార్డు కింద తనకిచ్చిన నగదు, జ్ఞాపికను కొరియర్లో అకాడమీకి పంపుతానన్నారు. ‘ఇప్పటికే ముగ్గురు రచయితలు హత్యకు గురయ్యారు. మరో రచయిత కేఎస్ భగవాన్‌కు మతతత్వ శక్తుల నుంచి ప్రాణహాని ఉంది. అయినప్పటికీ రచయితల, కార్యకర్తల, ఇతర వర్గాల భయాలను తొలగించేందుకు కేంద్రం ఏమీ చేయడం లేదు’ అని ఆమె మండిపడ్డారు.
దాద్రీ ఘటన తర్వాత ఉర్దూ రచయితలు ఆందోళనపడుతున్నారని, అందుకే అవార్డు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు అబ్బాస్ ముంబైలో చెప్పారు. ‘ఈ రోజే అవార్డు వాపసు చేస్తానన్నా. అయితే అకాడమీ కార్యాలయ సమయం అయిపోయిందన్నారు. సోమవారం వాపసు చేస్తా’ అని తెలిపారు. రచయితలకు, భావప్రకటన స్వేచ్ఛకు అండగా నిలబడ్డంలో కేంద్ర సాహిత్య అకాడమీ విఫలమైందని సచ్చిదానందన్ ఆరోపించారు. అకాడమీ బెంగళూరులో కల్బుర్గి సంస్మరణ సభ జరిపిందని, అయితే జాతీయ స్థాయిలో ఏదో ఒకటి చేయాల్సి ఉండిందని పేర్కొన్నారు. ఒక తీర్మానం తేవాలని అకాడమీకి తాను విజ్ఞప్తి చేసినా స్పందన కరవైందన్నారు. అకాడమీ జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, ఫైనాన్షియల్ కమిటీల్లోని తన పదవులకు ఆయన రాజీనామా చేశారు.