గులాబీ ‘సమితి’లు!
♦ రైతు సమన్వయ సమితుల ఏర్పాటులో అధికార పార్టీ నేతలదే హవా
♦ ప్రభుత్వ మార్గదర్శకాలకూ తిలోదకాలు
♦ గ్రామసభల నిర్వహణ లేకుండానే జాబితాలు
♦ పారదర్శకంగా సాగని ప్రక్రియ ∙నేటితో ముగియనున్న గడువు
మోర్తాడ్(బాల్కొండ): రైతు సమన్వయ సమితిల ఏర్పాటు ప్రక్రియకు శనివారంతో గడువు ముగియనుంది. సమితి సభ్యుల ఎంపికలో అధికార పార్టీ నేతలదే హవా కొనసాగుతోంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయిలో ఎంపిక కసరత్తు జరుగుతోంది. సమితి సభ్యుల ఎంపిక రాజకీయాలకతీతంగా సాగాల ని, పారదర్శకత లోపించకూడదని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేసింది. గ్రామస్థాయి రైతు సమన్వయ సమితి ఎంపికకు గ్రామసభ నిర్వహించాలని స్పష్టం చేసింది. కానీ ఎక్కడ కూడా గ్రామసభలు నిర్వహించింది లేదు. ఒకటి, రెం డు నియోజకవర్గాల్లో గ్రామ సభలు నిర్వ హిం చినా, మిగతా నియోజకవర్గాల్లో మాత్రం మొ క్కుబడిగా కూడా నిర్వహించిన దాఖలాల్లేవు.
ఏకపక్షంగా సభ్యుల ఎంపిక..
రైతు సమన్వయ సమితి సభ్యుల ఎంపిక ఏకపక్షంగానే సాగుతుందని, కేవలం అధికార పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలనే సమితి సభ్యులుగా ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామసభల ద్వారా సమన్వయ సమితి సభ్యులను ఎంపిక చేయాలని ప్రభుత్వం చేసిన సూచనను అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధులు పెడచెవిన పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. గ్రామ, మండల సమన్వయ సమితి సభ్యుల ఎంపికకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నామని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. అయితే, పలు గ్రామాల సమన్వయ సమితి సభ్యుల జాబితాలను అధికారపక్ష నేతలు వెల్లడించగా, ఏ జాబితాలోనూ ప్రతిపక్ష పార్టీల నాయకుల పేర్లు గానీ, రాజకీయ పార్టీలతో సంబంధం లేని రైతుల పేర్లు గానీ లేవు. ఈ జాబితాలను పరిశీలిస్తే రైతు సమన్వయ సమితి సభ్యుల ఎంపిక పూర్తిగా ఏకపక్షంగా సాగుతోందని స్పష్టమవుతోంది.
సమన్వయ సమితికి అధికారాలెన్నో..
రైతు సమన్వయ సమితిలకు ప్రభుత్వం రానున్న రోజుల్లో అధికారాలను భారీ స్థాయిలో కట్టబెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, పంటసాగుకు పెట్టుబడి సహాయం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం/పంటలను నిలువ ఉంచి రైతుబంధు పథకం ద్వారా రుణ సదుపాయం కల్పించడం.. తదితర అధికారాలను ప్రభుత్వం రైతు సమన్వయ సమితి సభ్యులకు బదలాయించనుంది. వ్యవసాయానికి సంబంధించి ఎన్నో అధికారాలను సమన్వయ సమితి సభ్యులకు ప్రభుత్వం అప్పగించనుండటంతో సమితి సభ్యులకు ప్రాధాన్యత పెరగనుంది. కానీ సభ్యుల ఎంపికలో పారదర్శకత లోపించడం వల్ల ముందు ముందు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోననే సంశయం నెలకొంది.
అధికార పార్టీకి వరంగా మహిళా రిజర్వేషన్..
సమన్వయ సమితి ఎంపిక ప్రక్రియలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. సమితిలో 15 మంది సభ్యులు ఉంటే, అందులో 50 శాతం మహిళలకు చోటు కల్పించాల్సిందే. ఈ నిబంధనను అధికార పార్టీ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సమితిలో ప్రతిపక్ష పార్టీల నేతలకు, చురుగ్గా ఉండే రైతులకు చోటు కల్పిస్తే భవిష్యత్తులో తమకు ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ‘మహిళ రిజర్వేషన్’ రూపంలో వారికి చెక్ పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు, చురుగ్గా ఉండే రైతుల స్థానంలో మహిళలకు చోటు కల్పించడం ద్వారా భవిష్యత్తులో తమ నిర్ణయాలకు ఎదురులేకుండా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
నిబంధనలకు విరుద్ధంగా జాబితా రూపకల్పన..
జిల్లాలో 27 మండలాలు ఉండగా, 393 గ్రామ పంచాయతీలు, 452 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రెవెన్యూ గ్రామాల వారీగానే రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. దీంతో జిల్లాలో గ్రామస్థాయిలో 452 సమన్వయ సమితిలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి గ్రామ సమితిలో 15 మంది చొప్పున సభ్యులు ఉంటారు. అంటే, జిల్లాలోని 452 రెవెన్యూ గ్రామాలకు గాను 6,780 మంది సభ్యులు ఉండనున్నారు. గ్రామస్థాయి సమన్వయ సమితిలో సభ్యులుగా ఎంపికైన వారినే మండల సమన్వయ సమితిలలో సభ్యులుగా కొనసాగించనున్నారు. గ్రామసభల ద్వారా సమన్వయ సమితి సభ్యులను ఎంపిక చేస్తే, ఇతర పార్టీల నాయకులతో ఇబ్బంది తలెత్తడం ఒక ఎత్తయితే అధికార పార్టీ నాయకుల మధ్యనే విభేదాలు తలెత్తే అవకాశం ఉందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
అందువల్లే గ్రామాలలోని ముఖ్య నాయకులతో సమన్వయ సమితి సభ్యుల జాబితాలను రూపొందించి జిల్లాకు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదం కోసం పంపించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. సమన్వయ సమితిల ఏర్పాటుకు శనివారంతో గడువు ముగియనుండటంతో ఆఖరు రోజునే జాబితాలన్నింటినీ ప్రభుత్వానికి పంపించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల మాత్రమే సమన్వయ సమితిల ఎంపిక కోసం సమావేశాలను నిర్వహించారు. మిగిలిన అన్ని చోట్ల మొక్కుబడిగానే సాగించారు. కొన్ని గ్రామాల్లోనైతే రహస్యంగానే ఎంపికను పూర్తి చేసి, చివరి రోజు వరకు గోప్యంగా ఉంచడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు.