Auto accidents
-
ఆటో బోల్తా.. నలుగురి పరిస్థితి విషమం
అచ్చంపేట రూరల్: అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడిన సంఘటనలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రంగాపూర్‌కు చెందిన కూలీలు శివారు ప్రాంతంలోని మిరపతోట వద్దకు ఆదివారం ఉదయం కూలీకి వెళ్లారు. పనులు ముగించుకుని తిరిగి గ్రామానికి ఆటోలో వస్తుండగా.. మార్గమధ్యంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. 10 మంది కూలీలకు కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. రూప్లి, చిన్ని, భామిని, రాజికి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. వైద్యులు తీవ్రంగా గాయపడిన నలుగురిని హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. డ్రైవర్ రాంలాల్ నిర్లక్ష్యంగా ఆటోను నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్పారు. ఏదుట్ల సమీపంలో ఆటో, బస్సు ఢీ గోపాల్పేట: ఏదుట్ల సమీపంలో బస్సు, ఆటో ఢీకొనడంతో ఆశావర్కర్ కాలు పూర్తిగా విరిగిపోయింది. రాజాపూర్కి చెందిన ఊర్కొండ రాణి కోడేరు మండలంలోని రాజాపూర్‌లో ఆశావర్కర్‌గా పనిచేస్తోంది. ఆదివారం వనపర్తికి వెళ్లి సాయంత్రం రాజాపూర్‌కు ఆటోలో తిరుగు ప్రయాణమైంది. ఏదుట్ల లోపలికి ఆటో వెళ్తుండగా.. నాగర్‌కర్నూల్ నుంచి వనపర్తి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను పక్క నుంచి ఢీకొట్టింది. రాణి కాలు కొంత బయటకు ఉండటంతో కాలు పూర్తిగా విరిగి కింద పడిపోయింది. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని గోపాల్పేట ఎస్ఐ వెంకటేశుర్లు తెలియజేశారు. -
ఆటో బోల్తా... ఏడుగురికి గాయాలు
భోగాపురం రూరల్: మండలంలోని సవరవిల్లి సమీపంలో జాతీయ రహదారిపై పాసింజర్ ఆటో గురువారం మధ్యాహ్నం అదుపుతప్పి రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఇనుప రెయిలింగ్‌ను ఢీకొని బోల్తా పడింది. శ్రీకాకుళంలో పండగ నిమిత్తం వెళ్లిన ఒక కుటుంబం తిరిగి విశాఖపట్నం వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తో పాటు, ఆరుగురు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఒక మహిళ తలకు బలమైన గాయం తగిలి తీవ్ర రక్తస్రావమైంది. జాతీయ రహదారిపై రాకపోకలు చేసేవారు తమ వాహనాలను ఆపి గాయాలపాలైన వారికి సహాయక చర్యలు చేపట్టారు. కారు ఢీకొని వ్యక్తికి.. పార్వతీపురంటౌన్: జియ్యమ్మవలస మండలం నీచుకువలస గ్రామానికి చెందిన ముదిలి గోవిందనాయుడు మోటార్‌సైకిల్‌పై ఖడ్గవలస వస్తుండగా పిట్టలమెట్ట బస్టాప్ వద్ద వెనుకనుంచి వస్తున్న కారు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో క్షతగాత్రుడిని పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఆటో బోల్తా పడి మరో నలుగురికి.. పార్వతీపురంటౌన్: గుమ్మలక్ష్మీపురం మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఆరిక రఘురాములు, మండంగి కుమారి, కడ్రక లత్తులు ఆటో బోల్తా పడిన ప్రమాదంలో గాయపడ్డారు. బుధవారం సాయంత్రం వారంతా మదురువలస గ్రామంలో పెళ్లి ఫంక్షన్‌కు ఆటోలో వెళ్లి తిరిగి వస్తుండగా జి. శివడ గ్రామం దాటిన తరువాత మలుపువద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. గమనించిన స్థానికులు 108 వాహనం ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి వారిని తరలించారు. ఈ ఘటనపై ఔట్‌పోస్టు పోలీసులు కేసు నమోదు చేశారు. (చదవండి: బె‘ధర’గొడుతున్న చికెన్.. వేసవి కాలం కావడంతో.. భారీగా పెరిగిన రేట్లు!) -
ఆటోను ఢీకొన్న కారు
గుంటూరు, పెనుగంచిప్రోలు (జగ్గయ్యపేట) : మండల పరిధి లోని జాతీయ రహదారిపై నవాబుపేట క్రాస్ రోడ్స్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహిళలు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందర్లపాడుకు చెంది న ఏడుగురు మహిళలు ఆటోలో నల్గొండ జిల్లా మేళ్లచెర్వు గ్రామంలో జరిగిన శుభకార్యానికి వెళ్లా రు. తిరుగు ప్రయాణంలో నవాబుపేట క్రాస్ రోడ్స్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా ఢీకొట్టింది. దీంతో రోడ్డు మార్జిన్ బ్యారికేడ్‌పైకి ఆటో దూసుకెళ్లింది. దానిలో ప్రయాణిస్తున్న కస్తాల చిననాగమ్మ, వేల్పుల రాణి, గజ్జల కుమారి, మార్కపూడి మరియమ్మ, కస్తాల నాగమణిలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న బాపులపాడుకు చెందిన ముగ్గురికి గాయాలవలేదు.క్షతగాత్రులను 108 వాహనంలో నంది గామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ అవి నాష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా : డ్రైవర్‌కు గాయాలు
ఎల్.ఎన్.పేట : మండలంలోని తురకపేట సెంటర్‌కు సమీపంలో పెద్దఖానాల వద్ద అలికాం–బత్తిలి రోడ్డుపై శనివారం ఆటో బోల్తా పడి డ్రైవర్‌కు గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... హిరమండలం నుంచి ఆమదాలవలస వైపు వెళ్తున్న ఆటో డ్రైవర్ ఇరుకైన ఖానా మధ్యకు చేరుకున్నాడు. అప్పటికే ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనానికి ఢీకొనంటానేమో అనే భయంతో ఆటో డ్రైవర్ కానాకు ఢీకొట్టడంతో రోడ్డు మధ్యలో ఆటో బొల్తాపడింది. ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారని స్థానికులు తెలిపారు. హిరమండలం కల్లట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామారావుకు తలపైన, ముఖంపైన గాయాలుయ్యాయి. డ్రైవర్‌ను హిరమండలంలోని ప్రైవేటు వైద్యుని వద్దకు చికిత్స కోసం తరలించినట్టు స్థానికులు చెప్పారు. -
ప్రాణాలు.. ‘ఆటో'ఇటో!
కర్నూలు: వరుస ఆటో ప్రమాదాలతో ఎన్నో కుటుంబాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షతగాత్రుల జీవితం దుర్భరంగా మారుతోంది. అతివేగం.. మద్యం మత్తు.. అజాగ్రత్త.. కారణం ఏదైనా ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనుభవ లేమి.. లెసైన్స్ లేని డ్రైవర్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డ్రైవింగ్ నిబంధనలపై కనీస అవగాహన లేకపోయినా కుటుంబ పోషణ నిమిత్తం డ్రైవర్లుగా మారిపోతున్న వారి వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో రోజూ ఏదో ఒక మూలన ఆటో ప్రమాదం సర్వసాధారణమవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 15 ఆటో ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఆయా ఘటనల్లో 15 మంది మృత్యువాత పడగా.. 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆటోలో వస్తున్నాడని తెలిస్తే క్షేమంగా చేరుకునే వరకు నమ్మకం లేని పరిస్థితి. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేద్దామని యేటా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రతిజ్ఞ చేయించడమే తప్పిస్తే.. చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ కనపర్చని పరిస్థితి. ప్రమాదాలు అధికంగా చోటు చేసుకునే 125 ప్రాంతాలను గుర్తించినా.. లోపాలను సరిదిద్దడం, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. గతనెల 31న కర్నూలు శివారులోని వెంకాయపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. కర్నూలు నుంచి పడిదెంపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారం రోజులు గడవక మునుపే గత శుక్రవారం అదే ప్రాంతంలో ఒకరు మృత్యువాత పడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోల్లో డ్రైవర్లు లెక్కకు మించి ఎక్కిస్తుండటం.. అతివేగంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. గత నెల 24న పత్తికొండ పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన 20 మంది ఆటోలో వెళ్తూ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించడం తెలిసిందే. ఏడుగురు ప్రయాణించాల్సిన సెవెన్ సీటర్ ఆటోలో డ్రైవర్ సహా 21 మంది ప్రయాణిస్తుండటమే ప్రమాదానికి కారణమైంది. అదే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు. చలనం లేని రవాణా శాఖ రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రవాణా శాఖ అధికారుల్లో చలనం కరువైంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కాలం చెల్లిన వాహనాలపై కన్నేయాల్సి ఉంది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. మద్యం తాగి ఆటోలో నడుపుతున్న డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన సివిల్ పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం గమనార్హం. జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఆటో ప్రమాదాలు కొన్ని... అక్టోబర్ 4న డోన్ మండలం కొచ్చెర్వు గ్రామ సమీపంలో లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడి డ్రైవర్ చాకలి మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు. 6న ఆలూరు అగ్నిమాపక కేంద్రం వద్ద ఆటో, స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు క్షతగాత్రులయ్యారు. 22న ఆలూరు శివారులోని కోళ్లఫాం మలుపు వద్ద ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో అరికెర గ్రామానికి చెందిన చిన్న ఈరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు. 29న ఎమ్మిగనూరు మండలం దేవబెట్ట గ్రామాకి చెందిన సామాజిక కార్యకర్త బాలరాజు ఆదోని నుంచి మోటర్ సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఆరేకల్లు సమీపంలో ఆటో ఢీకొని గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. 30న నందవరం మండలం ధర్మపురం వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.