ప్రాణాలు.. ‘ఆటో'ఇటో! | The survivors .. 'atoito! | Sakshi
Sakshi News home page

ప్రాణాలు.. ‘ఆటో'ఇటో!

Published Mon, Nov 24 2014 3:34 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

ప్రాణాలు.. ‘ఆటో'ఇటో! - Sakshi

ప్రాణాలు.. ‘ఆటో'ఇటో!

కర్నూలు: వరుస ఆటో ప్రమాదాలతో ఎన్నో కుటుంబాల్లో అంధకారం అలుముకుంటోంది. క్షతగాత్రుల జీవితం దుర్భరంగా మారుతోంది. అతివేగం.. మద్యం మత్తు.. అజాగ్రత్త.. కారణం ఏదైనా ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అనుభవ లేమి.. లెసైన్స్ లేని డ్రైవర్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

డ్రైవింగ్ నిబంధనలపై కనీస అవగాహన లేకపోయినా కుటుంబ పోషణ నిమిత్తం డ్రైవర్లుగా మారిపోతున్న వారి వల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో రోజూ ఏదో ఒక మూలన ఆటో ప్రమాదం సర్వసాధారణమవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే 15 ఆటో ప్రమాదాలు చోటు చేసుకోవడం తీవ్రతను తెలియజేస్తోంది. ఆయా ఘటనల్లో 15 మంది మృత్యువాత పడగా.. 40 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి.. ఆటోలో వస్తున్నాడని తెలిస్తే క్షేమంగా చేరుకునే వరకు నమ్మకం లేని పరిస్థితి. ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో పనిచేద్దామని యేటా రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అధికారులు ప్రతిజ్ఞ చేయించడమే తప్పిస్తే.. చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ కనపర్చని పరిస్థితి.

ప్రమాదాలు అధికంగా చోటు చేసుకునే 125 ప్రాంతాలను గుర్తించినా.. లోపాలను సరిదిద్దడం, ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారు. గతనెల 31న కర్నూలు శివారులోని వెంకాయపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురు క్షతగాత్రులయ్యారు. కర్నూలు నుంచి పడిదెంపాడుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

వారం రోజులు గడవక మునుపే గత శుక్రవారం అదే ప్రాంతంలో ఒకరు మృత్యువాత పడి.. ఐదుగురికి తీవ్ర గాయాలు కావడం ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోల్లో డ్రైవర్లు లెక్కకు మించి ఎక్కిస్తుండటం.. అతివేగంతో ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది.

గత నెల 24న పత్తికొండ పట్టణం బుడగ జంగాల కాలనీకి చెందిన 20 మంది ఆటోలో వెళ్తూ బస్సు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించడం తెలిసిందే. ఏడుగురు ప్రయాణించాల్సిన సెవెన్ సీటర్ ఆటోలో డ్రైవర్ సహా 21 మంది ప్రయాణిస్తుండటమే ప్రమాదానికి కారణమైంది. అదే రోజు వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృత్యువాతపడ్డారు.

 చలనం లేని రవాణా శాఖ
 రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన రవాణా శాఖ అధికారుల్లో చలనం కరువైంది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కాలం చెల్లిన వాహనాలపై కన్నేయాల్సి ఉంది. డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం ప్రమాదాల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. మద్యం తాగి ఆటోలో నడుపుతున్న డ్రైవర్ల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన సివిల్ పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర పోషిస్తుండటం గమనార్హం.

జిల్లాలో ఇటీవల చోటు చేసుకున్న ఆటో ప్రమాదాలు కొన్ని...
అక్టోబర్ 4న డోన్ మండలం కొచ్చెర్వు గ్రామ సమీపంలో లారీని తప్పించబోయి ఆటో బోల్తా పడి డ్రైవర్ చాకలి మద్దిలేటి అక్కడికక్కడే మృతి చెందాడు.
 6న ఆలూరు అగ్నిమాపక కేంద్రం వద్ద ఆటో, స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు క్షతగాత్రులయ్యారు.
22న ఆలూరు శివారులోని కోళ్లఫాం మలుపు వద్ద ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో అరికెర గ్రామానికి చెందిన చిన్న ఈరమ్మ అక్కడికక్కడే మృతి చెందగా.. ఏడుగురు గాయపడ్డారు.
29న ఎమ్మిగనూరు మండలం దేవబెట్ట గ్రామాకి చెందిన సామాజిక కార్యకర్త బాలరాజు ఆదోని నుంచి మోటర్ సైకిల్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా ఆరేకల్లు సమీపంలో ఆటో ఢీకొని గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
30న నందవరం మండలం ధర్మపురం వద్ద రెండు ఆటోలు ఢీకొనడంతో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement