పోలీసుల మాట వినుంటే..
గండేపల్లి ఘోర ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సోమవారం పోలీసులకు లొంగి పోయాడు. నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద లారీ డ్రైవర్ జోగా శ్రీను లొంగి పోయినట్లు సమాచారం. కాగా ఈ రోడ్డు ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకంగా 35మందిని ఎక్కించుకొని మితిమీరిన వేగంతో లారీని నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు.
ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ లారీని అదుపుచేయలేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్, క్లీనర్ పరారయిన విషయం తెలిసిందే. డ్రైవర్ క్లీనర్లిద్దరూ విశాఖ జిల్లా ఎస్.రాయవరం మండలం కొత్తపోలవరం వాసులు. కాగా డ్రైవర్ పీఎస్ లో లొంగిపోగా, క్లీనర్ పరారీలోనే ఉన్నాడు. ప్రమాద సమయంలో లారీలోని కూలీలంతా గాఢ నిద్రలో ఉన్నారు.
కొద్దిరోజు క్రితం పనుల కోసం చింతలపూడి వెళ్లిన వలస కూలీలు.. రాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. చింతలపూడి నుంచి ఏలూరుకు బస్సులో వచ్చారు. అక్కడి నుంచి స్వగ్రామం వెళ్లేందుకు రాత్రి 11గంటల సమయంలో ఏలూరు బైపాస్ వద్ద 35మంది కూలీలు లారీ ఎక్కారు. ప్రమాదానికి సరిగ్గా గంట ముందు... లారీని పోలీసులు ఆపారు. అధిక లోడుతో వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరించారు.
అయినా డ్రైవర్ వినిపించుకోలేదు. పోలీసుల మాట వినుంటే ఇంత ఘోరం జరిగుండేది కాదు. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో 16మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 15మంది గాయపడినట్లు సమాచారం. వారందరినీ రాజమండ్రి ప్రభుత్వాసుప్రతికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.