ఆటోల బడ్జెట్ 10 కోట్లు!!
ఎన్నికల ప్రచారం అనగానే మైకులు, భారీస్థాయిలో పోస్టర్లు, ఫ్లెక్సీలు.. ఇలా అన్నీ ఉండేవి. వాటితో బ్రహ్మాండంగా ప్రచారం చేసుకునేవాళ్లు. భారీగా ఆర్భాటం కూడా ఉండేది. అయితే, ఎన్నికల కమిషన్ నిబంధనల పుణ్యమాని ఎక్కడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడానికి లేకుండా పోయింది. అయితే నాయకులు మాత్రం ఊరుకుంటారా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా కొత్త కొత్త టెక్నిక్‌లు మొదలుపెట్టారు. ఊళ్లలో ఉన్న ఆటోలన్నింటికీ వెనకాలవైపు తమ ఫ్లెక్సీలు కట్టేయడం, అతికించడం మొదలుపెట్టారు. ఇంతకుముందు కూడా ఆటోల మీద ప్రకటనలకు సంబంధించిన చిన్న చిన్న ఫ్లెక్సీలు ఉండేవి. అయితే వాటి స్థానంలో ఇప్పుడు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకుల ప్రచార ఫ్లెక్సీలు వెలిశాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్లుగా, ఆటోలవాళ్లు కూడా ఈ ఎన్నికల సీజన్‌ను సొమ్ము చేసుకోడానికి సిద్ధమవుతున్నారు. సాధారణంగా నెల రోజుల పాటు ఒక ప్రచార పోస్టర్ ఆటో వెనక అతికించి ఉంచాలంటే ఇంతకుముందు 300 నుంచి 500 రూపాయల వరకు తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఎన్నికల వేళ కావడంతో, ఆ రేటు కూడా పెరిగిపోయింది. కనీసం వెయ్యి రూపాయలు లేనిదే పోస్టర్ పెట్టనిచ్చేది లేదని ఖరాకండిగా చెబుతున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గ కేంద్రంలో 10 వేల వరకు ఆటోలు ఉంటున్నాయి. ఆ లెక్కన ఒక్కో ఆటోకు వెయ్యి రూపాయలంటే, మొత్తం అందరు అభ్యర్థులు కలిసి పది కోట్ల రూపాయల వరకు కేవలం ఆటోలకే వెచ్చించాల్సి వస్తోంది. ఎన్నికలా.. మజాకా మరి!!