జయమ్మ కోసం ఆటోడ్రైవర్ సేవ
చెన్నై: గడిచిన 17 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యం బాగుపడాలని అభిమానులు పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తున్నారు. 'అమ్మ' పథకాలతో లబ్దిపొందిన ఇంకొందరు ఆమె పేరున తోచిన రీతిలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. చెన్నైకి చెందిన ఆటోడ్రైవర్ సుగుమార్.. జయ అపోలోలో చేరననాటి నుంచి ఆ ఆసుపత్రి ప్రాంగణంలోనే కనిపిస్తున్నాడు.
చికిత్స అనంతరం అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యేవారిని సుగుమార్ తన ఆటోలో వారు కోరుకున్న చోట దిగబెడుతున్నాడు. 17 రోజులుగా అతను ఇదే పనిలో ఉన్నాడు. 'అమ్మ తొందరగా కోలుకోవాలన్నదే నా ప్రార్థన.. ఆసుపత్రి నుంచి వెళ్లేవారిని ఆటోలో ఉచితంగా దింపడం ద్వారా నాకు తోచిన సేవ చేస్తున్నా. ఆ పుణ్యమంతా అమ్మకే దక్కాలి. అమ్మ బాగుండాలి' అని సుగుమార్ అంటున్నాడు.