ఆగిన ఆటోలు
= ఆటో గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బంద్
= ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు, రోగులు, విద్యార్థులు
= రోడ్డెక్కని 1.20 లక్షల ఆటోలు
= ఫ్రీడం పార్కులో ఆటో డ్రైవర్ల ధర్నా
= సీఎం సిద్ధుకు వినతి పత్రం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు :ఆటో గ్యాస్ ధరను పెంచడాన్ని నిరసిస్తూ ఆటో డ్రైవర్లు సోమవారం చేపట్టిన సమ్మె విజయవంతమైంది. రోడ్లపైకి ఆటోలు రాకపోవడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి మెజిస్టిక్ బస్టాండు, రైల్వే స్టేషన్లకు చేరుకున్న ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం. చిన్న పిల్లలు, భారీ లగేతో వచ్చిన వారు బస్సులు ఎక్కలేక టాక్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది. బీఎంటీసీ 250 అదనపు బస్సులు నడిపినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించ లేదు.
ప్రయాణికుల్లో చాలా మంది తమ ఇళ్లకు నడిచి వెళ్లగా, కొంత మంది తమ బంధు మిత్రులు తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలపై వెళ్లారు. నగరంలో సుమారు 1.20 లక్షల ఆటోలుండగా, దాదాపుగా ఒక్కటీ రోడ్డెక్కలేదు. యశవంతపుర, కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లు, శివాజీ నగర, శాంతి నగర బస్సు స్టేషన్లలో ప్రయాణికులు విధి లేక టాక్సీలను ఆశ్రయించాల్సి వచ్చింది. నిత్యం ఆటోల్లో పాఠశాలలకు వెళ్లే పిల్లలు అనేక ఇక్కట్లకు గురయ్యారు. తల్లిదండ్రులు ఆఫీసులకు సెలవు పెట్టి తమ పిల్లలను స్కూళ్లలో విడిచి, సాయంత్రం ఇంటికి పిలుచుకు వచ్చారు.
మార్కెట్ల నుంచి కూరగాయలు, పళ్లు, ఇతర సామాగ్రిని తీసుకు వెళ్లే వ్యాపారులు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రులకు వెళ్లాల్సిన రోగులు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొన్నారు. మరో వైపు 24 గంటలు సమ్మె చేపట్టిన ఆటో డ్రైవర్లు ఫ్రీడం పార్కులో ధర్నా నిర్వహించారు. తక్షణమే ఆటో గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు.