ఆనం సోదరులకు ఎదురుదెబ్బ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లా కాంగ్రెస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఆనం సోదరులకు పార్టీ పరంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మూ డు దశబ్దాలుగా వారి తో సన్నిహితంగా మె లుగుతున్న మాజీ కార్పొరేటర్ సన్నపురెడ్డి పెంచలరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరారు.
ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి, సీఈసీ సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సమన్వయకర్తలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, ప్రతాప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. గురువారం హైదరాబాద్‌లో జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు దాసా లక్ష్మీనారాయణ, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మంచికంటి శ్రీనివాసులు, చలువాది నాగేశ్వరరావు, గూడూరు శ్రీధర్‌రెడ్డి, ఆటోనగర్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు సలీం కూడా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
కాకుండా పలు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌లు కూడా ఉన్నారు. ఆనం కుటుంబంతో విడదీయరాని బంధం కలిగిన పెంచలరెడ్డి కొద్దిరోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంతోకాలంగా తాను ఆనం సోదరులకు అండదండలు అంది స్తున్నా తనను రాజకీయంగా ప్రోత్సహించడం లేదనే ఆవేదన ఆయనలో ఉంది. ముఖ్యంగా నగరపార్టీలో మాజీ మేయర్ భానుశ్రీకి ప్రాధాన్యం ఇస్తూ తనను విస్మరిస్తున్నారనే భావన కూడా ఉన్నట్టు సన్నపురెడ్డితో సన్నిహితంగా మెలిగేవారు చెబుతుంటారు. ఆయిల్ మిల్లర్స్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పెంచలరెడ్డికి నగర కాంగ్రెస్‌లో మంచిపట్టు ఉంది. ముఖ్యంగా వర్తక, వాణిజ్య సంఘాల్లో ఆయన మాటకు తిరుగులేదు.
తన వ్యాపార కార్యకలాపాలను నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కొనసాగిస్తుండగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను ద్వితీయశ్రేణి నాయకులను ప్రభావితం చేయగలరు. వ్యాపార పరంగా జిల్లా వ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పడం ఆ పార్టీకి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు. ఈ పరిణామం నగర కాంగ్రెస్‌లో సంచలనంగా మారింది. కాగా పెంచలరెడ్డి బాటలో మరికొందరు మాజీ కార్పొరేటర్లు, ద్వితీయశ్రేణి నాయకులు పయనించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.