ఆటో బోల్తా : విద్యార్థి మృతి
నందవరం (కర్నూలు) : పాఠశాలకు వెళ్లి వస్తున్న విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా నందవరం మండలం టి. సోమలగూడూరు శివారులో గురువారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శివ(12) అనే విద్యార్థి ఎమ్మిగనూరు మండలం దైవందిన్న గ్రామంలోని పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
కాగా రోజూలానే గురువారం ఆటోలో ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఆటో గ్రామ శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. శివ అనే విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.