Automotive Research Association
-
ఫేమ్ ఉల్లంఘనలపై విచారణ
న్యూఢిల్లీ: ఫేమ్–2 స్కీము నిబంధనల ఉల్లంఘనలో అధికారులపరంగా తప్పిదాలు జరిగాయన్న ఆరోపణలపైనా కేంద్రం దృష్టి పెట్టింది. వాటితో పాటు వేలిడేషన్, టెస్టింగ్ ఏజెన్సీలైన ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ), ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసీఏటీ) అధికారుల పాత్రపైనా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ విచారణ ప్రారంభించింది. దీనికి సంబంధించి నెల రోజుల వ్యవధిలో నివేదిక రావచ్చని శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు. ఆ తర్వాత ఉల్లంఘనలకు బాధ్యులైన వారితో పాటు సిస్టమ్స్‌ను కూడా సరిదిద్దే చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. స్థానికంగా తయారీని, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థలకు సబ్సిడీలు ఇచ్చేలా కేంద్రం రూ. 10,000 కోట్లతో ఫేమ్–2 స్కీమును ప్రవేశపెట్టింది. అయితే, నిబంధనలకు విరుద్ధంగా పలు కంపెనీలు పెద్ద స్థాయిలో దిగుమతి చేసుకుంటున్నాయని, ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ప్రోత్సాహకాలు పొందాయని ఆరోపణలొచ్చాయి. -
హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ఉన్న భౌగోళిక అనుకూలత దృష్ట్యా హైదరాబాద్‌లో ప్రి సర్టిఫికేషన్, ట్రైనింగ్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఏఆర్ఏఐ) డైరెక్టర్ డాక్టర్ రెజీ మథాయ్ ప్రకటించారు. గతేడాది రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ విభాగం, ఏఆర్ఏఐ మధ్య ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రెజీ నేతృత్వంలోని ఏఆర్ఏఐ బృందం రెండురోజుల పర్యటనకుగాను శనివారం రాష్ట్రానికి వచ్చింది. రాష్ట్ర ఎలక్ట్రానిక్స్, ఈవీ విభాగం డైరెక్టర్ సుజయ్ కారంపూరి నేతృత్వంలోని అధికారులు, ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ ప్రతినిధులు ఏఆర్ఏఐ బృందంతో టీ వర్క్స్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ప్రి సర్టిఫికేషన్, ట్రెయినింగ్ ల్యాబ్ ఏర్పాటుకు అవసరమైన వసతుల కోసం రావిర్యాలలోని ‘ఈ సిటీ’ని కూడా ఏఆర్ఏఐ బృందం సందర్శించింది. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనరంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతోందని, ప్రిసర్టిఫికేషన్, టెస్టింగ్ ల్యాబ్ వల్ల కొత్త యూనిట్లు ఏర్పాటు చేసేవారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని రెజీ మథాయ్ పేర్కొన్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలపై రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐఐసీతో చర్చలు జరుపుతామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆవిష్కరించిన ఈ పాలసీ ద్వారా పెట్టుబడులు వస్తున్నాయని, ప్రిసర్టిఫికేషన్ ల్యాబ్ రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణాన్ని మరింత మెరుగుపరుస్తుందని సుజయ్ వెల్లడించారు. కొత్తగా రెండు ఈవీ పార్కులు, టీ వర్క్స్, టీ హబ్ తదితరాలతో ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమను భారీగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం, భారతీయ ఆటోమోటివ్ పరిశ్రమ భాగస్వామ్యంతో ఏర్పాటైన ఏఆర్ఏఐకి ఆటోమోటివ్ రంగంలో పరిశోధన, అభివృద్ధి సంస్థగా ప్రాముఖ్యత ఉంది. పుణే కేంద్రంగా పనిచేస్తున్న ఏఆర్ఏఐకి చెన్నైలోనూ ప్రాంతీయ కార్యాలయం ఉంది. -
లోహియా ఈ-రిక్షాలు వస్తున్నాయ్...
ఒకసారి చార్జింగ్‌తో 80 కి.మీ. * వాహనం ధర రూ. 1.20 లక్షలు * లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఉన్న లోహియా ఆటో ఇండస్ట్రీస్ హమ్రాహి పేరుతో రూపొందించిన ఈ-రిక్షాలు జూన్‌కల్లా రోడ్లపై పరుగుతీయనున్నాయి. వీటి విక్రయానికై ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్ ప్రభుత్వాల నుంచి కంపెనీ ఆమోదం పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనూ దరఖాస్తు చేసుకున్నామని లోహియా ఆటో సీఈవో ఆయుష్ లోహియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఔత్సాహిక యువకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఒక ప్రముఖ ఫైనాన్స్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. ఫైనాన్స్ సౌకర్యాన్ని తొలుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేసేందుకు ఆ కంపెనీ ఉత్సాహంగా ఉందని వివరించారు. పశ్చిమ, దక్షిణ భారత్‌లో వాహనాలను మార్కెట్ చేసేందుకు హైదరాబాద్‌లో ప్రాంతీయ కార్యాలయాన్ని కొద్ది రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో 50 డీలర్షిప్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అయిదుగురు ప్రయాణించొచ్చు..: బ్యాటరీతో నడిచే ఈ-రిక్షాలో డ్రైవర్‌తోసహా అయిదుగురు ప్రయాణించొచ్చు. వాహన వేగం గంటకు 20 కిలోమీటర్లు. బ్యాటరీ ఒకసారి చార్జ్ చేస్తే 80 కి.మీ. వరకు వెళ్లొచ్చు. వాహనం ధర రూ.1.20 లక్షలు. అదనపు బ్యాటరీకి రూ.25 వేలు అవుతుంది. బ్యాటరీ జీవిత కాలం 15 వేల కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. వాహనానికి ఆటోమోటివ్ రిసర్చ్ అసోసియేషన్(ఏఆర్ఏఐ) ధ్రువీకరణ ఉందని ఆయుష్ లోహియా వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్ ప్లాంటులో ఎలక్ట్రిక్ స్కూటర్లు, రిక్షాలతోపాటు డీజిల్ త్రీ వీలర్లను కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. 2014-15లో ఇ-స్కూటర్లు 12 వేల యూనిట్లు విక్రయించింది. ఈ ఏడాది 20 వేల యూనిట్లు అంచనా వేస్తోంది. 2014-15లో దేశం లో ఈ-స్కూటర్లు సుమారు 35,000 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ-స్కూటర్‌కు రూ.9,400 వరకు కేంద్రం సబ్సిడీ ఇస్త్తోంది.