మళ్లీ ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56 బంతుల్లో 93; 12 ఫోర్లు; 3 సిక్స్) మరోసారి విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. ఓపెనర్ షాన్ మార్ష్ (107 బంతుల్లో 96; 9 ఫోర్లు; 3 సిక్స్) కూడా సహకారం అందించడంతో ఆదివారం భారత్ ‘ఎ’తో జరిగిన వన్డేలో ఆసీస్ ‘ఎ’ జట్టు 25 పరుగుల తేడాతో నెగ్గింది.
ఈనెల 14న జరిగే ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా కూడా పాల్గొంటున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్‌పై భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన మ్యాక్ ్సవెల్ ఏ బౌలర్‌ను వదిలిపెట్టలేదు. చివర్లో కౌల్టర్ నైల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. స్టువర్ట్ బిన్నీకి నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (57 బంతుల్లో 61; 7 ఫోర్లు; 2 సిక్స్), మురళీ విజయ్ (77 బంతుల్లో 60; 7 ఫోర్లు; 1 సిక్స్), పుజారా (64 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మిడిలార్డర్లో అంబటి తిరుపతి రాయుడు (24 బంతుల్లో 32; 4 ఫోర్లు; 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆఖర్లో రసూల్ (23 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా చివరి వరుస నుంచి సహకారం కరువయ్యింది. హాజెల్‌వుడ్, హెన్రిక్స్‌కు చెరి మూడు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్లు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌కు అర్హత పొందుతుంది.