హిందుత్వ ఎజెండాలో మరో అంశం
న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తన హిందుత్వ ఎజెండాను అమలు చేయడంలో భాగంగా ఒక్కొక్క అంశాన్నే గుట్టుచప్పుడు కాకుండా బయటకు తీస్తోంది. అందులో భాగంగానే 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి దారితీసిన అయోద్య ఉద్యమానికి ఆద్యుడు, వ్యూహకర్త ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌నాథ్ టెంపుల్ దివంగత మహంత్ అవైద్యనాథ్ స్మారక స్టాంపును అక్టోబర్ ఒకటవ తేదీన విడుదల చేయాలని నిర్ణయించింది. మాజీ ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల స్టాంపులను నిలిపివేయాలని నిర్ణయించిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అవైద్యనాథ్ స్టాంపును విడుదల చేయడం సెక్యులర్ భారత్‌లో ఎంతవరకు సమంజసమే వాదన పుట్టుకొస్తోంది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)కు కాస్తా భిన్నమైన కాషాయ రంగు దుస్తులను ధరించే మహంత్‌లు 1989లో జరిగిన అలహాబాద్ కుంభమేళాలో ఒక్కటయ్యారు. రెండు కాషాయ సంస్కృతులను మిలితం చేశారు. అక్కడే అయోధ్య ఉద్యమానికి నాంది పడింది. కుంభమేళా సందర్భంగా వీహెచ్‌పీ ఏర్పాటు చేసిన సాధువుల సమ్మేళనంలో అవైద్యనాథ్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు ఉన్న స్థలంలో రామ మందిరాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. ‘ఇతర మతాల పవిత్ర స్థలాల్లో ముస్లింలు మసీదులు నిర్మించరాదని ఖురాన్ చెబుతోంది. ముస్లింలతో గొడవెందుకు మరో స్థలంలో రామ మందిరాన్ని నిర్మించుకోవాల్సిందిగా ప్రభుత్వం మనకు చెబుతోంది. ఇది ఎలా ఉందంటే రావణాసురుడితో యుద్ధాన్ని నివారించడం కోసం రాముడు మరో సీతను పెళ్లి చేసుకోవాలన్నట్లు ఉంది. మనం మాత్రం అక్కడే రామ మందిరాన్ని నిర్మించాలి’ అని ఆయన నొక్కి చెప్పారు. బాబ్రీ మసీదున్న చోటనే మందిరం నిర్మించాలంటూ ఆరెస్సెస్, వీహెచ్‌పీ నాయకులు వంతపాడారు. ఆ దిశగానే సాధువుల సమ్మేళనం తీర్మానించింది.
అలా మొదలైన అయోధ్య ఉద్యమానికి అవైద్యనాథ్ వ్యూహకర్తగా వ్యవహరిస్తూ వచ్చారు. 1992 డిసెంబర్లో అయోధ్యలో కరసేవకులను రెచ్చగొడుతూ ప్రసంగించిన వారిలో ఉమా భారతి, సాధ్వీ రితంబర, పరమహంస రాంచందర్ దాస్, ఆచార్య ధర్మేంద్ర దేవ్, బీఎల్ శర్మతోపాటు అవైద్యనాథ్ కూడా ఉన్నారు.
1989 వరకు పలు ఎన్నికల్లో హిందూ మహాసభ తరఫున పోటీ చేసిన అవైద్యనాథ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరి, 1991, 1996లలో బీజేపీ తరఫున గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. 2014, సెప్టెంబర్ 12వ తేదీన చనిపోయారు. అంతకు దశాబ్దం క్రితం, 1914లోనే తన వారసుడిగా గోరఖ్‌నాథ్ టెంపుల్ మహంత్‌గా ఆదిత్యనాథ్‌ను ప్రకటించారు. ఇప్పుడు ఆధిత్యనాథ్ ‘లవ్ జిహాద్’కు వ్యతిరేకంగా ప్రచారోద్యమాన్ని సాగిస్తున్నారు.