డబుల్ నిరాశ!
ముందుకు సాగని రెండు పడక గదుల ఇళ్ల పథకం
►పునాది రాళ్లకూ నోచుకోని పరిస్థితి
►గిట్టుబాటు కాదని నిర్మాణాలకుముందుకు రాని కాంట్రాక్టర్లు
►ప్యాకేజీలుగా విభజించినా ఫలితం శూన్యం
►కల్లలుగానే లబ్ధిదారుల కలలు
ఒకింటి వాళ్లమవుతున్నామన్న నిరుపేదల కలలుకల్లలుగానే మిగులుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనతో చాలామందిపేదలు ఇక తమ ఇంటి కష్టాలు గట్టెక్కుతాయని సంబరపడ్డారు. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే వారి ఆశలు ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది ఆ పథకం పరిస్థితి. ఇళ్లు ఎప్పుడు కడతారో.. తమకు ఎప్పుడు ఇస్తారోనని నిరుపేదలు ఇంకా కళ్లు కాయలు కాసేలా చూస్తూనే ఉన్నారు.
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘రెండు పడక గదుల’ ఇళ్ల నిర్మాణ పథకంపడకేసింది. రెండేళ్ల క్రితం భూమి పూజచేసినా ఇప్పటివరకు పునాదిరాయి పడకపోవడంతో పేద ప్రజల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పథకం కార్యరూపం దాల్చకపోతే ఓట్లడగమని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే, క్షేత్రస్థాయిలో పథకం పురోగతిని గమనిస్తే.. నిర్ణీత గడువులోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడం అనుమానంగానే కనిపిస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన 2,005 ఇళ్లలో 1,780 గృహాలకు జిల్లా యంత్రాంగం పాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
ఇందులో కేవలం 535 ఇళ్లకు సంబంధించిన కాలనీలకు మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. వీటిలో కేవలం 50 గృహాలు మినహా మిగతా వాటికి పునాదిరాయి కూడా పడలేదు. దీన్నిబట్టి ఈ పథకం పురోగతిని అంచనా వేసుకోవచ్చు. నిర్దేశిత అంచనా వ్యయానికి అనుగుణంగా ఇళ్లను నిర్మించలేమని కాంట్రాక్టర్లు మొండికేయడంతో ఈ పథకం అటకెక్కింది. నిర్మాణ సామగ్రి, వ్యాట్, ఇతరత్రా పన్నుల మినహాయింపులు ఇచ్చినా.. గిట్టుబాటు కావడం కష్టమని భావించిన కాంట్రాక్టు సంస్థలు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడంతో డబుల్ ట్రబుల్లో పడింది. ఆఖరికి ప్యాకేజీలుగా పనుల విభజించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు పథకం అమలును పర్యవేక్షించాల్సిన గృహానిర్మాణ సంస్థను రద్దు చేయడం కూడా ప్రతిబంధకంగా మారింది. ఇందిరమ్మ పథకంలో జరిగిన అవకతవకలను సాకుగా చూపి హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తివేయడం క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావం చూపుతోంది. గృహానిర్మాణ సంస్థ స్థానే పనుల పర్యవేక్షణ బాధ్యతను పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీకి అప్పగించడం సత్ఫలితాలనివ్వడంలేదు. చేతినిండా పనులతో ఎప్పుడు బిజీగా ఉండే ఈ ఇంజనీరింగ్ శాఖలు ఈ పథకంపై అంతగా దృష్టి కేంద్రీకరించడం లేదు. కాగా, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్ సహా మిగతా నియోజకవర్గాల్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్ల నిర్మాణాలను బల్దియానే పర్యవేక్షిస్తోంది.
కొత్తగా 5,046 ఇళ్లు మంజూరు
ఇటీవల ప్రభుత్వం కొత్తగా 5,046 ఇళ్లను జిల్లాకు మంజూరు చేసింది. నియోజకవర్గానికి వేయి చొప్పున (గ్రామీణ నియోజకవర్గాలకు మాత్రమే) నిర్దేశించింది. వీటిలో 3,389 ఇళ్లకు పాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం మంజూరైన పనులకే మోక్షం కలగకపోగా.. అదనంగా మరిన్ని ఇళ్లు జత కావడం యంత్రాంగానికి గుదిబండగా మారింది. జిల్లావ్యాప్తంగా డబుల్ కాలనీల నిర్మాణాలకు 250.71 ఎకరాలను కేటాయించి లేఅవుట్లను అభివృద్ధి చేసింది. మౌలిక సదుపాయాల కల్పనతో లేఅవుట్లను డిజైన్ చేసినా కాంట్రాక్టు సంస్థలు కరుణించకపోవడం సర్కారు లక్ష్యాన్ని నీరుగారుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.5.30లక్షలను యూనిట్ విలువగా నిర్దేశించిన ప్రభుత్వం.. మౌలిక సౌకర్యాల కల్పనకు పట్టణ ప్రాంతాల్లో రూ.75 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.25 లక్షలుగా ప్రకటించింది. అయినప్పటికీ ఈ అంచనా వ్యయాలకు అనుగుణంగా ఇళ్లను నిర్మించి ఇవ్వలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో యంత్రాంగానికి ఏమీ పాలుపోవడంలేదు.
కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు
మరోవైపు సకల వసతులతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వనుందనే ప్రచారం కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఇండ్లపై గంపెడాశలు పెట్టుకున్న పేదలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 1,32,163 అర్జీలు వచ్చాయంటే ఈ పథకంపై బడుగులు ఏ స్థాయిలో ఆశలు పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో కొత్తగా విలీనం అయిన కల్వకుర్తి నియోజకవర్గంలో భూముల లభ్యత స్పష్టత వచ్చినా.. ఇంకా పరిపాలనా పరమైన అనుమతులు జారీ చేయలేదు.