Aviation authorities
-
కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం
అల్మేటీ: కజకిస్తాన్‌లో శుక్రవారం జరిగిన ఒక విమాన ప్రమాదంలో 12 మంది మరణించారు. దేశంలోని అతిపెద్ద నగరం అల్మేటీ నుంచి ఉదయం ఏడు గంటల ప్రాంతంలో సుమారు వంద మందితో టేకాఫ్ తీసుకున్న విమానం ఆ తరువాత కొద్దిసేపటికే కూలిపోయింది. బెక్ ఎయిర్ అనే విమానయాన సంస్థకు చెందిన ఈ విమానం రాజధాని నూర్ సుల్తాన్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే టేకాఫ్ తరువాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే విమానం రాడార్‌లో కనిపించకుండా పోయిందని, అల్మేటీ సరిహద్దుల్లోని ఓ రెండంతస్తుల భవనంపై కూలిపోయిందని విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. విమానం కూలిపోయిన ధాటికి విమానం రెండు ముక్కలైందని, ప్రాణాలతో ఉన్న వారిని శకలాల నుంచి వెలికి తీసేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్నాయని వివరించింది. విమానంలో మొత్తం 95 మంది ప్రయాణికులు, ఐదుగురు సిబ్బంది ఉండగా కెప్టెన్‌తోపాటు 11 మంది మరణించినట్లు ఆ ప్రకటన వివరించింది. ఈ దుర్ఘటనలో 53 మంది గాయపడ్డారని, వీరిలో తొమ్మిది మంది పిల్లలూ ఉన్నారని తెలిపింది, ఘటనపై విచారణ జరపడంతోపాటు, బెక్ ఎయిర్ సంస్థ వాడుతున్న ఫొక్కర్ మోడల్ విమానాలపై కజకిస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది. విమానం టేకాఫ్ తీసుకునే సమయంలోనే దాని తోకభాగం రన్‌వేను రెండుసార్లు తాకిందని, ఇది పైలట్ తప్పిదమా? లేదా సాంకేతికపరమైన సమస్య? అన్నది తేల్చాల్సి ఉందని ఉప ప్రధాని స్కైలార్ చెప్పారు. -
రావణుడే తొలి వైమానికుడు
కొలంబో: చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడేనట. ఈ విషయాన్ని స్వయంగా శ్రీలంక ప్రభుత్వం వెల్లడించింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో గగనతలంలో విహరించాడని.. రానున్ను ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తామని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే న్యూస్18తో ఫోన్లో మాట్లాడారు. ‘చరిత్రలో విమానాన్ని ఉపయోగించి గగనతలంలో విహరించిన తొలి వైమానికుడు రావణుడే. పురాణాల ఆధారంగా ఈ విషయం చెప్పడం లేదు. ఈ విషయంలో పూర్తి స్థాయి పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపిస్తాం’ అన్నారు. కటునాయకేలో ఉన్న బండారునాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5,000 సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి నేటి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని ఈ సమావేశం తేల్చింది. రానున్న ఐదేళ్లలో ఈ విషయాన్ని సాంకేతికంగా నిరూపించాలని నిర్ణయించింది. అంతేకాక శ్రీలంకలో రావణుడిని గొప్ప రాజుగా.. దయ గల మనిషిగా చెప్పుకుంటారు. సీతా దేవిని అపహరించాడు, రాక్షసుడు అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఒప్పుకోరు. అది కేవలం భారతీయుల వాదనగా కొట్టి పారేస్తారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక అంతరిక్షంలోకి పంపిన ఓ ఉగప్రహానికి రావణ అనే పేరు పెట్టింది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆ దేశ ప్రజలు రావణుడికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో. -
సంక్రాంతి కానుక... గగన విహారం
నేటి నుంచి మళ్లీ హెలీ టూరిజం 17వ తేదీ వరకు అవకాశం హైదరాబాద్: నగరవాసులకు సంక్రాంతి కానుకగా టూరిజం శాఖ అధికారులు హెలీ టూరిజాన్ని మళ్లీ పునరుద్ధరించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, సాగర్ మధ్యలో ఉండే తథాగతుడిని వీక్షించి అక్కడికి కాస్త దూరంలో ఉండే బిర్లా మందిర్, శాసనసభా ప్రాంగణం, చార్మినార్, మక్కా మసీదు, గోల్కొండ కోట పరిస రాలు... హైటెక్ సిటీ, సైబరాబాద్‌లోని ఐటీ భవనాలన్నింటినీ నిమిషాల్లో వీక్షించాలను కునేవారికి ఇదో అవకాశం. గత ఏడాది మార్చి ఒకటిన నెక్లెస్ రోడ్డు, జలవిహార్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతం లో హెలీటూరిజం కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. కొంతకాలం నడిచాక ఉపరాష్ట్ర పతి నగరానికి వచ్చిన నేపథ్యంలో గగనతల ఆంక్షలు విధించి, ఏవియేషన్ అధికారులు అనుమతులు నిరాకరించారు. దానికితోడు బుకింగ్ పొరపాట్ల కారణంగా పర్యాటకులు ఆసక్తి చూపకపోవటంతో గగన విహారానికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ అనుమతులను పొందారు. టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం తుంబే ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వారిని ఒప్పించి హెలీటూరిజం ప్రారంభమయ్యేలా చేశారు. ఐదురోజులే ఈ అవకాశం... ఈ హెలీ టూరిజాన్ని ఐదురోజులకే పరి మితం చేశారు. 13 నుంచి 17 వరకు సాగు తుంది. ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు హెలీకాప్టర్ తిరుగు తుంది. ఒక్కొక్కరికి రూ.3,500 టికెట్ ధర చెల్లించాలి. నలుగురు కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ.3 వేలు, 12 మంది కుటుంబసభ్యులు కలసి వస్తే ఒక్కొక్కరికి రూ. 2,500 చెల్లించాలి. మేరా ఈవెంట్స్ డాట్ కామ్‌లో బుకింగ్ చేసుకోవాలి.