'రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన'
* కరువు నివారణ చర్యల్లో విఫలం
* ఉపాధి పథకం నిర్వీర్యానికి సిద్ధపడుతోంది
* పెట్టబడిదారుల కోసం భూ బ్యాంక్
* రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆవుల శేఖర్ ధ్వజం
* దశల వారీగా ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమని ప్రకటన
అనంతపురం అర్బన్: ప్రభుత్వం సాగిస్తోందని ఏపీ రైతు సంఘం (సీపీఐ) రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ ధ్వజమెత్తారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో కరువు నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యిందన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యానికి సిద్ధపడుతోందన్నారు. పెట్టుబడిదారుల కోసం భూ బ్యాంక్ ఏర్పాటు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై దశలవారీగా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన స్థానిక సీపీఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి.నారాయణస్వామితో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు ప్రభుత్వానికి కనిపించడం లేదన్నారు. కరువు మండలాలు ప్రకటించినప్పటికీ ఆదుకునేందుకు చర్యలు చేపట్టదేని విమర్శించారు. ఉపాధి కరువై లక్షల మంది రైతులు, రైతులు కూలీలు వలస పోతున్నా పట్టడం లేదన్నారు.
ఉపాధి హామీ పథకం కింద పనిదినాలను 200 రోజులకు పెంచి రోజు కూలీ రూ.300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు 2014-15 సంవత్సరానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు తక్షణం ఇవ్వాలన్నారు. కరువు దృష్ట్యా పేదలకు వచ్చే జూన్ వరకు ఉచితంగా రేషన్ ఇవ్వాలన్నారు. 13 జిల్లాలోనూ 15 లక్షల ఎకరాల భూ బ్యాంక్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమయ్యిందన్నారు. తమకు సహకరించిన కార్పొరేట్ శక్తులకు భూమిని కట్టబెట్టేందుకు చూస్తోందని విమర్శించారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని, భూ బ్యాంక్ విధానానికి వ్యతిరేకంగా దశలవారీగా ప్రత్యక్ష ఆందోళన చేపడతామని, సీఎం మొదలు అధికార పార్టీ ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రైతు సంఘం కార్యదర్శులు చెన్నప్ప యాదవ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.