పెట్టుబడి కొంత..లాభం కొండంత
ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగిపోయాయి. విత్తనాలు, క్రిమిసంహారక మందుల్లో ఏది మంచిదో, ఏది నకిలీదో తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. విచక్షణారహితంగా పురుగుమందులు వాడటం వల్ల ఆర్థికంగా భారమే తప్ప పెద్దగా ఫలితం ఉండని పరిస్థితి. ఆదీగాక దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. సేంద్రియ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది. మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఎరువులు, పురుగు మందులు, విత్తనాలపై రైతులు అవగాహన పెంచుకోవాలి.
ఖర్చులు తగ్గించుకోవడం ముఖ్యం
తెలిసీ తెలియని విత్తనాలు వేయడం, అవి మొలకెత్తకపోవడం, ఒక వేళ మొలకెత్తినా కాపు సరిగా రాకపోవడం లాంటి కారణాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం సాగు ఖర్చులు తగ్గించడానికి వివిధ రకాల రాయితీలను అందుబాటులో ఉంచింది. వాటిని సద్వినియోగం చేసుకుంటే రైతులు లాభాలు పొందవచ్చు.
విత్తన శుద్ధి తప్పని సరి
భూ సంరక్షణ, వ్యాధుల నివారణ చర్యలు తప్పకుండా పాటించాలి. సూటి ఎరువులు(యూరియా, దుక్కిలో సూపర్, విత్తిన తర్వాత పొటాష్) వాడాలి. సూక్ష్మధాతు లోపాలను కచ్చితంగా సవరించాలి. మూస పద్ధతి ఖర్చులకు స్వస్తి చెప్పి శాస్త్రవేత్తలు, అధికారుల సిఫార్సు మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల విత్తనం ద్వారా సంక్రమించే తెగుళ్లను నివారించుకునే వీలుంది. తద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి పొందవచ్చు.
ఖర్చు తగ్గించుకునే మార్గాలు
రైతులు భూసార పరీక్షలు చేయించి, దాని ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులను వాటి మోతాదు మేరకే వాడాలి.
భాస్వరం.. మొక్క నిలదొక్కుకునే దశలో మాత్రమే అవసరం. కాబట్టి దీన్ని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి. పైపాటుగా వేస్తే ఎలాంటి ఉపయోగం లేకపోగా ఖర్చు పెరుగుతుంది.
పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. వేపపిండి, యూరియా కలిపి వాడితే పోషకాలు వృథా కాకుండా నెమ్మదిగా పంటకు అందుతాయి.
నత్రజని ఎరువులు ఒకేసారి ఎక్కువ మోతాదులో వేయడం కంటే విడతల వారీగా పంటలకు అందించడం వల్ల ఫలితం ఉంటుంది.
వ్యవసాయ భూముల్లో ఎక్కువగా జింక్, ఐరన్, బోరాన్, మెగ్నీషియం లోపాలు కనిపిస్తున్నాయి. ఇవి కాకుండా మిగిలిన ఎరువులను తరచుగా వాడటం వల్ల భూముల్లో ఎక్కువ మోతాదులో నిల్వ ఉన్నాయి.
సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మెగ్నీషియం లోపాలను అధిగమించేందుకు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి.
సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా సస్యరక్షణ మందుల ఖర్చులు తగ్గించుకోవచ్చు.
పంటలపై ఆశించిన చీడపీడలను వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా నిర్ధారించుకుని సిపార్సు చేసిన మందును, సిఫార్సు చేసిన సమయంలో పిచికారీ చేయాలి.
ఇవి చేయకండి
కాంప్లెక్స్ ఎరువులు వాడితే మన భూముల్లో అంతగా ఫలితం ఉండదు. పైగా వాటి ధరలు కూడా ఎక్కువ.
పిచికారీ చేసే మందులు మోతాదుకు మించి వాడటం మానుకోవాలి.
ఒక ఎకరాకు సిఫార్సు చేసిన మందుకు ఇష్టారీతిగా నీటిని కలపకూడదు. 200 లీటర్ల నీటిని వాడటం మంచిది.
పురుగుమందులు, వ్యాధి మందులు కలిపి (ఉదా : ప్రాఫినోపాస్-ఎక్సాకొనగోట)వాడకూడదు.
ఒకేసారి రెండు మూడు మందులను మిశ్రమంగా వాడరాదు(ఉదా : ఇమిడాక్లోఫిడ్, అసిటేట్ను వరి, వేరుశనగలో కలిపి వాడుతుంటారు). ఇలా కలిపి వినియోగిస్తే రైతుకు ఖర్చు పెరగడమేకాక మందులు సరిగా పనిచేయవు. ఒక్కోసారి పంటను నాశనం చేస్తాయి.