పింప్రిలో నీటి పొదుపుపై అవగాహన
పింప్రి, న్యూస్‌లైన్ : నగరంలో తాగు నీటి సమస్య తీవ్రమైంది. మొదటి సారిగా రోజు విడిచి రోజు నీటి సరఫరాను చేస్తున్నారు. ఈ క్రమంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రజలను జాగ్రత్త పరచడానికి నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి. ర్యాలీల ద్వారా తమ సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నాయి. అవర్తన గ్రూపు, పింప్రి-చించ్వడ్ సిటిజన్ ఫోరమ్, జలదిండి, సంఘటన్‌కు చెందిన కార్యకర్తలు, నిగిడి చౌక్ నుండి బిగ్ ఇండియా చౌక్ వరకు ర్యాలీని నిర్వహించి నీటి పొదుపుపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉప మేయరు రాజు మసల్, కార్పొరేటర్లు ప్రసాద్ శెట్టి, నగర కార్పొరేషన్ నీటి సరఫరా విభాగ ఇంజనీర్లు ప్రవీణ్ లడకత్, అమోల్ దేశ్ పాండే, విల్వాదేవ్, అనంద్, పానస్, రాజీవ్‌తో పాటు నగర ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రతి చౌక్ నందు వాడ్ స్పీకర్లు చేత పట్టి నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ప్రజలకు వివరించారు. లీకేజీని అరికట్టాలని, నీటి లీకేజీల గురించి కార్పొరేషన్ అధికారులకు వెంటనే తెలపాలని, ప్రతి వ్యక్తి తమ బాధ్యతగా నీటి పొదుపునందు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ర్యాలీ నిగిడి చౌక్ నుంచి బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, అకృతి గాల్, విఠల్ మందిర్, మాసాకాంత్ చౌక్, భేల్ చౌక్ మీదుగా, వర్షంలోనూ ర్యాలీ కొనసాగింది.